- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. సీఐ నాగరాజు విచారణపై ఉత్కంఠ!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు పోలీసు కస్టడీ నిబంధనలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు విధించిన కఠినమైన షరతులపై స్టే ఇవ్వాలని కోరుతూ దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది.
ఈ కేసులో నిజాలు రాబట్టేందుకు నిందితుడైన సీఐ నాగరాజును కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా, హైకోర్టు కొన్ని కఠినమైన షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. విచారణను కేవలం రాజమండ్రి సెంట్రల్ జైలులోనే జరపాలని, అలాగే కేవలం సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసమే నిందితుడిని జైలు నుంచి బయటికి తీసుకురావాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా నిందితుడిని జైలు నుంచి బయటకు తీసుకువచ్చినప్పటి నుంచి తిరిగి లోపలికి పంపే వరకు ప్రతి నిమిషాన్ని వీడియోలో రికార్డు చేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
హైకోర్టు విధించిన ఈ నిబంధనల వల్ల కేసు దర్యాప్తు పురోగతిపై తీవ్ర ప్రభావం పడుతుందని, నిందితుడిని నిబంధనలు లేకుండా విచారించేందుకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే పిటిషన్ వేసింది. కాగా.. ప్రభుత్వం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన మాజీ సీఐ నాగరాజు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం వేసే పిటిషన్‌పై ఎలాంటి ఆదేశాలు ఇచ్చే ముందైనా తన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులోని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై స్పందిస్తూ.. ప్రతివాది అయిన మాజీ సీఐ నాగరాజుకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని, అలాగే ఎలాంటి నిర్ణయం కూడా ఇప్పుడే చెప్పలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని పేర్కొంటూ, తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.






