- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP | రాష్ట్రవ్యాప్తంగా 11 చోట్ల డ్రగ్స్ కార్యాలయాల ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔషధ నియంత్రణ, మాదకద్రవ్యాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔషధ నియంత్రణ, మాదకద్రవ్యాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, డ్రగ్స్ నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 11 కొత్త డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నూతన కార్యాలయాలను మంగళగిరి ఏపీఐఐసీ ప్రాంగణం వేదికగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం రూ. 11 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక భవనాలను నిర్మించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నాణ్యతలేని, కల్తీ మందుల విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కొత్త కార్యాలయాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే మాదకద్రవ్యాల నియంత్రణ కోసం "ఈగల్" వంటి ప్రత్యేక బలగాలు ఏర్పాటు కాగా, డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాల విస్తరణ ద్వారా ఔషధ రంగంలో పర్యవేక్షణ మరింత పటిష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఇప్పటివరకు అద్దె గదుల్లో డ్రగ్స్ కార్యాలయాలు ఉండేవి, ఆ ఇబ్బందులు తప్పాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4 వేల డ్రగ్ శాంపిల్స్ సేకరిస్తున్నామని పేర్కొన్నారు. కొత్త ల్యాబుల ఏర్పాటుతో ఏటా 3వేల శాంపిల్స్ అదనంగా సేకరణ జరుగుతుందన్నారు. లక్ష్యానికి ఇంకా 9వేల శాంపిల్స్ వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. విజయవాడలో స్టేట్ డ్రగ్స్ కార్యాలయం అందుబాటులోకి వస్తే మరో 10 వేల శాంపిల్స్ పరీక్షలు చేయవచ్చని తెలియజేశారు. కల్తీ మందులు, కాలం చెల్లిన మందులు నిరోధానికి ఔషధ ప్రయోగశాలలు ఉపయోగపడతాయన్నారు. కల్తీ, నాణ్యతలేని మందులు చలామణిలో ఉండరాదనేది ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉందని, రెగ్యులర్ పోస్టులను ఏపీఎస్ఎస్సీ ద్వారా కాకుండా వేగంగా భర్తీ చేయడానికి మెడికల్ సర్వీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు.
కేంద్రప్రభుత్వం 20 వేల జన ఔషధ దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల పేదలకు మేలు జరుగుతుందన్నారు. కాలం చెల్లిన మందులు, నిషేధిత మందులు మార్కెట్లోకి వస్తున్నాయన్నారు. వీటిపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 152 మందుల దుకాణాలను ఇటీవల తనిఖీలు చేస్తే 148 దుకాణాలకు సరైన అనుమతులు లేవని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అధికారులు, ఉద్యోగులు అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం ప్రాధమిక బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి మండలానికి ఒక జన ఔషధ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని ప్రకటించారు.
ఈ 11 నూతన కార్యాలయాలు అందుబాటులోకి రావడంతో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) తన పరిధిని విస్తరించుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. తనిఖీలను వేగవంతం చేయడం, ఔషధ లైసెన్సుల జారీ, రెన్యూవల్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా, వికేంద్రీకృతం చేయడానికి అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నాణ్యత ప్రమాణాలను పాటించని ఫార్మసీలు, ఔషధ తయారీ యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఈ కార్యాలయాలు స్థానిక స్థాయిలో కీలక కేంద్రాలుగా పనిచేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కల్తీ ఔషధాల బెడదను నివారించడంలో, లైసెన్స్ లేని మందుల అమ్మకాలను అరికట్టడంలో ఇవి క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఈ కార్యాలయాల ద్వారా మందుల నాణ్యత పరీక్షల కోసం నమూనాలను సేకరించడం, వాటి విశ్లేషణను వేగవంతం చేయడం వంటి పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టారు. ఇవి ప్రజలకు సురక్షితమైన, ప్రభావవంతమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించడంలో డీసీఏ పనితీరును మెరుగుపరుస్తాయని అధికారులు తెలిపారు.






