రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ

by Thanuru Gopichand |   (  Updated:2026-01-04 05:19:46  IST  )

తెలంగాణ Vs ఆంధ్రప్రదేశ్.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ
X

దిశ, వెబ్ డెస్క్ : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (Rayalaseema Lift Irrigation) పనులను తాను నిలిపివేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం (AP Government) ఖండించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం పనులను నిలిపివేశారన్న ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టింది. తన విన్నపం మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనులు నిలిపివేశారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవిగా పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చేపట్టారని పేర్కొంది. సీమకు రోజు 3 టీఎంసీల నీరు అందిస్తామని ప్రకటనతో గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైయస్ జగన్ పనులను చేపట్టారంది. మాజీ సీఎం జగన్ ప్రచారం కారణంగానే లిఫ్ట్ పనులపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని స్పష్టం చేసింది. ఫిర్యాదును విచారించిన సంబంధిత వ్యవస్థలు, అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేశాయని తెలియజేసింది. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న 2020లోనే ఈ మేరకు ఎన్జీటీ, కేంద్ర ప్రభుత్వం పనులను నిలిపివేశాయని స్పష్టం చేసింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే పనులు నిలిపివేశారని కుండ బద్ధలు కొట్టింది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలో అధికార, విపక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయనే అనుమానాలను వ్యక్తం చేసింది. నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story