AP | నేడు జిల్లాల పునర్విభజనపై సీఎం సమావేశం

by Thanuru Gopichand |

AP | నేడు జిల్లాల పునర్విభజనపై సీఎం సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : జిల్లాల పునర్విభజనపై (Districts Bifurcation) సీఎం చంద్రబాబు (CM Chandra Babu Naidu) అధ్యక్షతన నేడు సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు జరగనున్న సమావేశానికి జిల్లాల పునర్విభజనపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం హాజరు కానుంది. మార్కాపురం, మదనపల్లి జిల్లాల ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై ముఖ్యమంత్రి సమాలోచనలు చేయనున్నారు.

మంత్రి వర్గ ఉప సంఘం స్పెషల్ ఫోకస్

సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాల పునర్విభజనపై మంత్రి వర్గ ఉప సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉప సంఘంలో భాగంగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, సత్య కుమార్ యాదవ్‌ తుది నివేదికను సీఎంకు అందజేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై ప్రత్యేక శ్రద్ధను వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిన విషయం తెలిసిందే. మండలాలు, పంచాతీయలు విభజన చేయకుండా నియోజకవర్గమంతా ఒకే డివిజన్‌లో ఉండాలని ఇప్పటికే నిర్ణయించారు.

మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా

మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత తెలిపిన విషయం విదితమే. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో పాటు.. జిల్లాల సరిహద్దుల మార్పులపై నేడు సీఎంతో మంత్రులు చర్చించనున్నారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకూ మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి తీసుకున్న నిర్ణయాన్ని నేడు సమావేశంలో ప్రస్తావించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మరో ఆరు డివిజన్ల వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో.. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరతోపాటు నక్కపల్లి, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు ఉండనున్నట్లు సమాచారం.

డిసెంబర్ 31లోగా

జనగణన ప్రకారం డిసెంబర్ 31లోగా జిల్లా పునర్విభజన పూర్తి చేయాల్సి ఉంది. ఏడుగురు సభ్యులతో కూడిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం ఆగస్టు 13వ తేదీన రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఆ తర్వాత, జిల్లాల వారీగా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాలు, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అలాగే ప్రాంతాల వారిగా వచ్చిన అభ్యర్థనలను ఉపసంఘానికి సమర్పించారు. మొత్తంగా, ఉపసంఘానికి దాదాపు 200 వరకు అర్జీలు స్వీకరించి, పరిశీలించి, మంత్రుల ఉప సంఘం విస్తృతంగా చర్చించింది. ఈ చర్చల్లో భాగంగా జిల్లాల అధికారుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించడం జరిగింది.

Next Story