AP | చెప్పిన చోట ఆగలేదని బస్సు అద్దాలు ధ్వంసం

by Thanuru Gopichand |

ఇదెక్కడి చోద్యం.. తాను ఆపమంటే బస్సు ఆపలేదని బస్సు అద్దం పగలగొట్టాడు ఓ కుర్రోడు. అద్దం పగలకొట్టడమే కాకుండా పై నుంచి డ్రైవరు, కండక్టర్లను దబాయించాడు. వారితో వాగ్వాదానికి దిగి ఏం చేసుకుంటారో చేసుకోండని చక్కా పోయాడు.

AP | చెప్పిన చోట ఆగలేదని బస్సు అద్దాలు ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇదెక్కడి చోద్యం.. తాను ఆపమంటే బస్సు ఆపలేదని బస్సు అద్దం పగలగొట్టాడు ఓ కుర్రోడు. అద్దం పగలకొట్టడమే కాకుండా పై నుంచి డ్రైవరు, కండక్టర్లను దబాయించాడు. వారితో వాగ్వాదానికి దిగి ఏం చేసుకుంటారో చేసుకోండని చక్కా పోయాడు. ఈ సందర్భంగా ధర్మరవం నుంచి తాడిపత్రి వెళ్లే మార్గంలో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలోని వివరాల ప్రకారం ఏపీఎస్ ఆర్టీసికి చెందిన బస్సు ధర్మవరం నుంచి తాడిపత్రి వైపు ప్రయాణిస్తోంది. ఓ గ్రామం వద్ద ఓ కుర్రోడు బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బస్సు ఆ ఊరి మీదుగా ప్రయాణిస్తోంది. బస్సును చూసిన ఆ కుర్రోడు బస్సు ఆపాలని సైగ చేశాడు. అయితే అక్కడ బస్ స్టాప్ లేకపోవడంతో బస్సును డ్రైవరు ఆపలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కుర్రోడు చేతిలో రాయిని పట్టుకొని బస్సు వైపు వేగంగా విసిరాడు. దీంతో బస్సు ముందు భాగంలోని అద్దం కొంత డ్యామేజ్ అయ్యింది.

ఆకస్మికంగా జరిగిన రాళ్ల దాడితో ఉలికిపడిన బస్సు డ్రైవరు బస్సును నిలిపివేశాడు. అది గమనించిన ఆ కుర్రోడు అంతటితో ఆగకుండా బస్సు ఎక్కి డ్రైవరుతో వాదులాటకు దిగాడు. తాను ఆపమంటే బస్సు ఆపరా అంటూ గొడవపడ్డాడు. బస్టాండ్ అక్కడే ఉందని బుకాయించాడు. అసలు బస్సు అద్దం ఎందుకు పగలగొట్టావంటే దురుసుగా సమాధానం ఇచ్చాడు. బస్టాప్ లో బస్సు ఆపవా అంటూ దబాయించాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బస్సు దిగి వెళ్లిపోయాడు. ప్రయాణికులు స్పందిస్తూ నిమిషాల వ్యవధిలోనే బస్సును మూడుసార్లు ఆపారని.. ఇక ఆ కుర్రోడు ఆపమన్న చోట కూడా ఎలా ఆపుతారని అన్నారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగుతున్న తిన్న డ్రైవరు, కండక్టర్లు జరిగిన నష్టానికి తలలు పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు చెబుతున్నారు. అధికారులు తామెలా సమాధానం చెప్పుకోవాలని అనుకుంటూ ఉన్నారు. కుర్రోడు చదువుకుంటున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. విద్యార్థికి ఇంత ఆవేశం ఉండడం, పబ్లిక్ ప్రాపర్టీ పట్ల బాధ్యత లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Next Story