- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు.. అవాక్కైన ఎమ్మెల్యే గంటా
విశాఖపట్నం మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మద్యం, బీరు సీసాలు కలకలం రేపాయి. PHCని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో మద్యం, బీరు సీసాలు(Liquor, beer bottles) కలకలం రేపాయి. PHCని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinivasa Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి ప్రాంగణంలో విచ్చలవిడిగా పడి ఉన్న ఖాళీ మద్యం బాటిళ్లను చూసి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రోగులకు వైద్యం అందించాల్సిన పవిత్రమైన స్థలంలో ఇలాంటి పరిస్థితులు ఉండటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పారిశుధ్య నిర్వహణ లోపించడంపై ఆగ్రహం
ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రత రాజ్యమేలుతుండటం, పారిశుధ్య నిర్వహణ లోపించడంపై అక్కడి వైద్య అధికారులు, సిబ్బందిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోగుల ఆరోగ్యంతో ఆటలాడొద్దని, ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అధికారులను హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అలాగే పారిశుధ్య పనులను మెరుగుపరచాలని ఆదేశించారు.
కఠిన చర్యలు తీసుకోండి..
వైద్యశాల ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు, ఆకతాయిల చేష్టలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గంటా పోలీసులను ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాల్లో నిఘాను పటిష్టం చేయాలని, రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తిని పాడుచేసే వారిపై, ఆసుపత్రి నియమాలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.






