ఎన్నికలకు ముందే భారీ స్కెచ్.. వెలుగులోకి మరో పెను సంచలనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-22 13:49:57  IST  )

ములకలచెరువు నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది...

ఎన్నికలకు ముందే భారీ స్కెచ్.. వెలుగులోకి మరో పెను సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్: ములకలచెరువు(Mulakalacheruvu), ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) నకిలీ మద్యం(Fake alcohol) తయారీ ఘటనలు రాష్ట్రంలో సంచలన రేపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో పెను సంచలనం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జయచంద్రారెడ్డిని ఎన్నికలకు ముందే పథకం ప్రకారమే తెలుగుదేశం పార్టీలోకి పంపినట్లు ఓ ఆడియో వెలుగులోకి వచ్చింది. ములకలచెరువు నకిలీ మద్యం తయారీకి సంబంధించి వైసీపీ నేతలు మాట్లాడుకున్న ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైసీపీ నేతల కాల్ ఆడియోలో నకిలీ మద్యం ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది. జగన్ ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యం తయారీకి బీజం వేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి పంపాలని నిర్ణయించారు. అనుకున్నట్టుగా 2024 ఎన్నికలకు ముందు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2020 నుంచే వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వడంతో స్వాగతం పలుకుతూ జనార్ధన్ రావు సంబురాలు చేశారు. ఈ ఆడియో కాల్ బయటకు రావడంతో నకిలీ మద్యం వ్యవహారం ఏ వైపు వెళ్తుందనే ఉత్కంఠ నెలకొంది.

కాగా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1గా జనార్ధన్ రావు ఉన్నారు. జనార్ధన్ రావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో జనార్ధన్ రావు చాలా విషయాలు తెలిపారు. నకిలీ మద్యం తయారీ వ్యవహారమంతా మాజీ మంత్రి జోగి రమేశ్ కనుసన్నలోనే జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో రాజకీయ దుమారం మరింతగా చెలరేగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్న కాల్ తాజాగా వెలుగులోకి వచ్చింది.

Next Story