- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్యసాయి జిల్లా | కంచె చేను మేసిన చందంగా ఆలయ ఈఓ తీరు!!
కంచె చేను మేస్తే పంట నాశనం అవుతుంది.. అలానే ఆలయ ఈఓ (Temple EO) దేవాలయ సొమ్మును దోచుకుంటే దేవాలయ నిర్వహణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇబ్బంది ఏర్పడుతుంది.

దిశ, వెబ్ డెస్క్ : కంచె చేను మేస్తే పంట నాశనం అవుతుంది.. అలానే ఆలయ ఈఓ (Temple EO) దేవాలయ సొమ్మును దోచుకుంటే దేవాలయ నిర్వహణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇబ్బంది ఏర్పడుతుంది. అటువంటి సంఘటనే సత్యసాయి జిల్లాలో జరిగింది. గుడికి, గుడిలో దేవుడికి, దేవుడి సొత్తుకు కాపాల ఉండాల్సి ఓ ఈఓ.. దేవుడి సొత్తుపైనే కన్నేశాడు. సొత్తును దోచుకొని పోయే ప్రయత్నంలో భక్తుల కంట పడ్డాడు. ఇక ఆ ఈఓను పట్టుకొని పోలీసులకు భక్తులు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం కదిరి రూరల్ మండలంలోని యర్రదొడ్డిలో గంగమ్మ గుడి (Erradoddi Gangamma Gudi) ఉంది. గుడి నిర్వహణ, సంరక్షణకు కమిటీ కూడా ఉంది. అంతేకాకుండా ఒక ఈఓ కూడా ఉన్నారు. అంతా బాగానే ఉన్నా.. మరి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు ఈఓ కన్ను అమ్మవారి ఆభరణాలపై పడింది. ఆదివారం గుట్టు చప్పుడు కాకుండా అమ్మవారి నగలను తరలించే ప్రయత్నం చేశాడు. అమ్మవారి ఆభరణాలు, విలువైన చీరలు, ఇతర వస్తువులు గుడి నుంచి తీసుకెళ్లేందుకు ఆటోలో వేసుకొని బయలుదేరాడు. అమ్మవారి అనుగ్రహమో.. ఈఓ గ్రహపాటో తెలియదు గానీ అతను భక్తుల కంటపడ్డాడు. యర్రదొడ్డి గంగమ్మ గుడి వద్ద నుంచి అమ్మవారి సొత్తు తరలించుకుపోతుండగా అది గమనించిన భక్తులు ఈఓను అడ్డుకున్నారు. అతని వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా సుమారు ఐదు కేజీల వెండి ఆభరణాలు, అమ్మవారి చీరలు, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఈఓపై భక్తులతో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరిని అడిగి అమ్మవారి సొత్తును తరలిస్తున్నారని నిలదీశారు. అతనితో పాటు ఉన్న కుటుంబ సభ్యులపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. సరైన సమాధానం రాకపోవడంతో కుటుంబ సభ్యులతో సహా ఈఓను పోలీసు స్టేషన్ వరకు తీసుకెళ్లారు. పోలీసులకు అప్పజెప్పి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈఓ వద్ద నుంచి గుడిలోని అమ్మవారికి చెందిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈఓ ప్రవర్తపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులను విమర్శిస్తూనే ఈఓను సస్పెండ్ చేయాలని అంటున్నారు.






