- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీమ స్థితిగతులు మార్చేలా బడ్జెట్.. సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు
రాయలసీమ స్థితిగతులు మార్చే విధంగా ఏపీ బడ్జెట్ ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆమె హర్షం వ్యక్తం చేశారు...

దిశ, ధర్మవరం (రాప్తాడు): రాయలసీమ స్థితిగతులు మార్చే విధంగా ఏపీ బడ్జెట్ ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శనివారం ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ఎమ్మెల్యేలతో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిశారు. బడ్జెట్‌లో పలు రంగాలకు కేటాయింపులపై ఎమ్మెల్యే సునీత ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురం జిల్లాకు అత్యధిక మేలు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రూ.30వేల కోట్లు కేటాయింపులపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీని వలన అనంతపురం జిల్లాకు అత్యధికంగా మేలు చేకూరే అవకాశం ఉందన్నారు. జిల్లాలో హార్టికల్చర్ పంటలు ఎక్కువగా సాగవుతున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేటాయింపుల ద్వారా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇక్కడి నుంచి ఎగుమతులు, పండ్ల ఆధారిత పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉందన్నారు. మరోవైపు వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,598 కోట్లు కేటాయించడం కూడా మంచి పరిణామం అన్నారు. దీని ద్వారా వ్యవసాయాభివృద్ధికి దోహదం కానుందన్నారు. పంచాయతీరాజ్ శాఖకు రూ.22,942 కోట్లు కేటాయింపుల వలన గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేసినట్టైందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందన్నారు. జల వనరుల శాఖకు రూ.18,224 కోట్లు కేటాయించడం వలన ప్రధాన ప్రాజెక్టులు దాదాపు పూర్తి చేసే పరిస్థితి ఉందన్నారు. గృహ నిర్మాణ శాఖకు రూ.6357 కోట్లు కేటాయింపుతో ఈ ఏడాది ఇళ్ల నిర్మాణాలు వేగవంతగా సాగుతాయన్నారు. జల్ జీవన్‌కు రూ.4,000 కోట్లు కేటాయింపుల వలన రాప్తాడు నియోజకవర్గం వంటి ప్రాంతాల్లో జరుగుతున్న పనులు పూర్తవుతాయన్నారు. మరోవైపు సంక్షేమ పథకాలకు ఎక్కడా తగ్గకుండా అభివృద్ధికి సమానంగా నిధులు కేటాయింపులు జరిగాయని.. మొత్తంగా ఇది ప్రజారంజక బడ్జెట్ అని ఎమ్మెల్యే సునీత కొనియాడారు.






