తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. అనంతపురం RDTకి కేంద్రం లైన్ క్లియర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-24 06:24:36  IST  )

అనంతపురం ఆర్డీటీకి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనిపై సీఎం, మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. అనంతపురం RDTకి కేంద్రం లైన్ క్లియర్
X

దిశ, వెబ్ డెస్క్: దశాబ్దాలుగా అనంతపురం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వేల గ్రామాల్లో పేదల కోసం అద్భుత వైద్య, సామాజిక సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) కు లైన్ క్లియరైంది. గత ఏడాది కాలంగా నిలిచిపోయిన ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) అనుమతులను కేంద్ర హోంశాఖ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి ఆర్డీటీ సంస్థకు అధికారిక సమాచారం అందింది. మతమార్పిడిలకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏడాది క్రితం ఈ సంస్థకు విదేశీ నిధుల సేకరణపై కేంద్రం ఆంక్షలు విధించింది. అయితే.. తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్డీటీకి విదేశీ నిధులు పొందే మార్గం మళ్లీ సుగమమైంది.

సమగ్ర విచారణ అనంతరం సానుకూల నివేదిక

ఆర్డీటీ సంస్థ మతమార్పిడిలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ గత ఏడాది కాలంగా లోతైన విచారణ జరిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎంపీలు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆర్డీటీ కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితమైందని, మతమార్పిడిలకు పాల్పడలేదని రాష్ట్ర ప్రజాప్రతినిధులు కేంద్ర హోంశాఖకు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నేరుగా ఈ అంశాన్ని పర్యవేక్షించడమే కాకుండా, కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. హోంశాఖ జరిపిన విచారణలో కూడా సంస్థపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలడంతో పాటు సానుకూల నివేదికలు రావడంతో కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు మంజూరు చేసింది.

కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. "దశాబ్దాలుగా పేదల కోసం ఆర్డీటీ అద్భుత సేవలు అందిస్తోంది. గతంలో నిధుల నిలిపివేత కారణంగా సంస్థ సేవలకు కొంత అంతరాయం కలిగింది. విదేశీ నిధుల సమస్యను పరిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వేల గ్రామాల్లో వివిధ రకాల సేవలందిస్తున్న ఈ సంస్థకు కేంద్రం మద్దతుగా నిలవడం శుభపరిణామమని కొనియాడారు.

మాట నిలబెట్టుకున్నాం: మంత్రి నారా లోకేష్

ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇది లక్షల మంది సంతోషించే సమాచారమని ఆయన పేర్కొన్నారు. "కేంద్ర ప్రభుత్వంతో పదేపదే సంప్రదింపులు జరపడం వల్లే నేడు ఈ అడ్డంకులు తొలగిపోయాయి. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలలో ఆర్డీటీ చేస్తున్న కృషిని కేంద్రానికి వివరించాం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని, హోంమంత్రి, అధికారులకు కృతజ్ఞతలు" అని లోకేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఆర్డీటీకి రుణపడి ఉంటాం: మంత్రి సవిత

అనంతపురం ఆర్డీటీకి కేంద్రం లైన్ క్లియర్ చేయడంపై మంత్రి సవిత సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేసిన నిరంతర కృషి వల్లే ఆర్డీటీ సేవలు కొనసాగే అవకాశం లభించిందని, జిల్లా ప్రజల తరపున వారికి రుణపడి ఉంటామని ఆమె అన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతుల మంజూరుతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story