మమ్మల్ని రక్షించండి.. మయన్మార్ సరిహద్దులో బందీలుగా ఏపీ యువకులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-17 14:50:53  IST  )

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏపీకి చెందిన 21 మంది యువకులను ఓ ఏజెన్సీ మోసం చేసింది...

మమ్మల్ని రక్షించండి.. మయన్మార్ సరిహద్దులో బందీలుగా ఏపీ యువకులు
X

దిశ, వెబ్ డెస్క్: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏపీకి చెందిన 21 మంది యువకులను ఓ ఏజెన్సీ మోసం చేసింది. అంతేకాదు వారందరినీ మయన్మార్ ఏజెన్సీకి థాయ్ ల్యాండ్ ఏజెన్సీ అమ్మేసింది. దీంతో వారంతా మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా చిక్కుకుపోయారు. ఉద్యోగాల పేరుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 21 మంది యువకులకు ఆన్ లైన్ ద్వారా థాయ్ ల్యాండ్ ఏజెన్సీ ఎరవేసింది. ముగ్గురు వ్యక్తుల మాటలను నమ్మి ఆన్ లైన్‌లో దరఖాస్తు చేశారు. దీంతో 21 మంది యువకులను అక్కడికి తీసుకెళ్లారు. అమ్మాయిల్లా మాట్లాడుతూ చాటింగ్ చేసే ఉద్యోగం చేయాలని చెప్పడంతో యువకులు షాక్‌కు గురయ్యారు. తాము ఆ పని చేయలేమని తేల్చి చెప్పేశారు. భారత్ వెళ్లి పోతామని చెప్పారు. దీంతో వారందరికి ఏజెన్సీ నిర్వాహకులు చిత్ర హింసలు పెట్టారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తోందోనని బెదిరించారు. దీంతో చేసేదేమీ లేక వాళ్లుచెప్పినట్లు చేస్తున్నామని బాధిత యువకులు తెలిపారు. తమను భారత్ తీసుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాట్లాడారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తమనందరినీ భారత్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. మరోవైపు యువకుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా తమవారిని భారత్ తీసుకురావాలని పలువురు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

Next Story