అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ : సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-12 06:44:34  IST  )

అభివృద్ధికి.. సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట.

అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) రాష్ట్ర అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరావతిని శ్మశానం ఎడారి అని హేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అన్నారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్టుగా అభివర్ణించారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారని సీఎం కొనియాడారు.

ఇతర రాష్ట్రాలను నీళ్లిస్తాం

నీటి వనరుల వినియోగంపై స్పందిస్తూ, ప్రస్తుతం మూడు వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయని అన్నారు. రాబోయే జూన్ నాటికి గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా ఏపీ అడ్డుపడలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం 88 శాతం పనులు పూర్తయిన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు కూడా నీటిని ఇచ్చే స్థాయికి చేరుకుంటుందని ధీమా వ్యక్తపరిచారు. అన్ని రిజర్వాయర్లలో 970 టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు.

చారిత్రాత్మక విజయం

​రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహంపై సీఎం మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడులలో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రావడం ఒక చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో కుదిరిన సుమారు రూ. 13.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. ఎస్ఐపీబీ ద్వారా రూ.8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని సీఎం పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతోందన్నారు. పెట్టుబుడులను తీసుకురావడంలో అధికారులు చేసిన కృషిని అభినందించారు.

తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం

ఇదే సమయంలో ఇంధన రంగంలోనూ ఏపీ సంచలనం సృష్టించిందని, దేశంలోనే మొదటిసారిగా విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించి వినియోగదారులకు ఊరటనిచ్చిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో యూనిట్ విద్యుత్ ధరపై రూ.1.19 తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.

మంచి ఫలితాలను ఇచ్చింది

2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామన్నారు. ప్రజల ఆశలను నిలబెట్టి వారిలో మళ్లీ విశ్వాసాన్ని కల్పించామన్నారు. సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగామన్నారు. ఈ ఏడాది మరింత కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు. గతేడాది 12 శాతానికి పైగా వృద్ధి సాధించామన్నారు. 16 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా పని చేయాలని సూచించారు. భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాదిలో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తామని ప్రకటించారు. వీబీ జీ రామ్ జీ చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

గిన్నీస్ రికార్డులు సాధించే దిశగా

25 ఏళ్ల క్రితం పీపీపీ విధానంలో జాతీయ రహదారుల నిర్మాణం ప్రారంభమైందని, నేడు రాష్ట్రంలో గిన్నీస్ రికార్డులు సాధించే దిశగా రహదారుల నిర్మాణం జరుగుతోందని సీఎం చంద్రబాబు తెలియజేశారు.

దేవుడితో రాజకీయాలు బాధాకరం

తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని, తిరుమలలో దుర్మార్గంగా ఖాళీ మద్యం బాటిళ్లు పెడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడితో రాజకీయాలు చేయడం బాధాకరమని, దాన్ని తాను ఖండిస్తున్నానని ప్రకటించారు.

Next Story