టిడ్కో ఇళ్లపై అలర్ట్.. వారికి డబ్బు వెనక్కి!

by velandi.Saikiran |

టిడ్కో ఇళ్ల‌కు డబ్బులు కట్టినప్పటికీ, ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు

టిడ్కో ఇళ్లపై అలర్ట్.. వారికి డబ్బు వెనక్కి!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టిడ్కో ఇళ్ల‌పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల‌కు డబ్బులు కట్టినప్పటికీ, ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పీ నారాయణ, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సీడీఎంఏ డైరెక్టర్ సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు కీల‌క ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 83,865 మంది ఈ టిడ్కో ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకోగా, వారికి రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని కీలక సూచనలు చేశారు. అదే సమయంలో నిర్మాణం పూర్తయిన 1,00,875 టిడ్కో ఇళ్ల‌ను త్వరలోనే లబ్ధిదారులకు అందించి, గృహ ప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో బిల్డింగ్ డోర్స్ కు క్యూ ఆర్ కోడ్ నెంబర్లు జత చేయాలని కూడా ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాగునీరు కలుషితం కాకుండా స్మార్ట్ వాటర్ పైప్ లైన్‌ తయారీకి గ్రిడ్ ప్రణాళిక అమలు చేయనున్నట్లు ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అదే సమయంలో 100 రోజుల ప్రణాళిక కోసం 123 యూఎల్బీలలో మౌలిక వసతుల అమలు కూడా ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

Next Story