ఎయిర్ పోర్టంటే కేవలం నిర్మాణం కాదు : కేంద్రమంత్రి

by Thanuru Gopichand |   (  Updated:2026-01-04 07:51:59  IST  )

ఉత్తరాంధ్ర భవిష్యత్తు రూపురేఖలు మారబోతున్నాయి.

ఎయిర్ పోర్టంటే కేవలం నిర్మాణం కాదు : కేంద్రమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : ఎయిర్ పోర్టంటే కేవలం నిర్మాణం కాదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) అన్నారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయానికి (Bhogapuram Airport) టెస్ట్ ఫ్లైట్ లో ఆయన ఆదివారం చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ఎయిర్ పోర్టు అంటే కేవలం ఒక నిర్మాణాలు ఉన్న ప్రాంతం కాదన్నారు. అది నెలకొన్న ప్రాంతంలో ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే కేంద్రమని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా విశాఖ ఎకనామిక్ రీజియన్ బలపడుతుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోందన్నారు. కేంద్ర బడ్జెట్ లో విశాఖ ఎకనామిక్ జోన్ కు నిధుల కేటాయింపు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని ప్రకటించారు.

భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే వీలుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రానున్న నాలుగైదు నెలల్లో ఎయిర్ పోర్టును ప్రారంభించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం అన్నారు. అందుకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి కావొచ్చాయని వివరించారు. ఈ ప్రాజెక్టుతో వివిధ జిల్లాల ప్రజలు అనుసంధానం అవుతున్నారన్నారు. గత 18 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రలో ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించడమే తప్ప.. అది పూర్తవుతుందనే నమ్మకం ఉండదనే విమర్శలు వస్తుంటాయన్నారు. అటువంటి విమర్శలకు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం సమాధానంగా నిలుస్తోందన్నారు. టెస్ట్ ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయ్యిందంటే దాని అర్థం ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుందని స్పష్టం చేశారు.

Next Story