AI : అనుసరించడం కాదు.. ముందుండి నడిపిద్దాం : మంత్రి నారా లోకేష్

by Thanuru Gopichand |

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI)ను అనుసరించడం కాదు.. దాన్ని మనమే ముందుండి నడిపిద్దామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు.

AI : అనుసరించడం కాదు.. ముందుండి నడిపిద్దాం : మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI)ను అనుసరించడం కాదు.. దాన్ని మనమే ముందుండి నడిపిద్దామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ – ఉద్యోగాల భవిష్యత్తు – సవాలును అవకాశంగా మార్చుకోవడం (AI and the Future of Jobs — Turning Disruption into Opportunity) అనే అంశంపై సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ (CII Partnership Summit) ప్రాంగణంలో జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏఐ ప్రస్తుతం పరిశ్రమల పనితీరును మారుస్తోందన్నారు. దాన్ని అనుకూలంగా తీర్చిద్దిదుకోవడం మన చేతిలో ఉందన్నారు. పున: నైపుణ్యం, పున: నిర్వచనం, పునరాలోచించడం ప్రస్తుత అవసరం అని స్పష్టం చేశారు.

రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్..

రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ (Upskilling) ద్వారా రేపటి ఉద్యోగాలకు అనువైన ఎకోసిస్టమ్ నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యూచర్ స్కిల్స్ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఏఐ ఎథిక్స్, డేటా స్టోరీటెల్లింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, సస్టైనబుల్ టెక్నాలజీ (Sustainable Technology) మీద కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు. ఏఐ శిక్షణ, నైతిక పర్యవేక్షణ, మానవ యంత్రాల సహకారంతో 2025నాటికి ప్రపంచవ్యాప్తంగా 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఒక అంచనా ఉందన్నారు. భవిష్యత్ సాంకేతికలతో ఉద్యోగాలు పొందటమే కాకుండా, వాటిలో అసాధారణ, చురుకైన పాత్ర పోషించేలా మన యువతను తయారు చేయాలని పిలుపునిచ్చారు.

బ్రిడ్జిగా ఉండాలి.. అడ్డంకి కాకూడదు..

ఏఐ సాంకేతికత భవిష్యత్తుకు ఒక బ్రిడ్జిగా ఉండాలి తప్ప అడ్డంకి కాకూడదని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. ఏఐ విప్లవం పట్టణ, గ్రామాల మధ్య, పురుషులు, మహిళలు మధ్య, నైపుణ్యం కలిగిన వారు, వెనుకబడిన వారి మధ్య అంతరాలను పెంచకూడదన్నారు. భారతదేశ జనాభాలో 65శాతం మంది 35ఏళ్లలోపు వయస్కులు ఉన్నారన్నారు. ఈ డెమొగ్రఫిక్ డివిడెండ్ ను డిజిటల్ లిటరసీ (Digital Literacy), వొకేషనల్ ట్రైనింగ్, ఎంటర్ ప్రెన్యూరల్ మద్దతుతో భవిష్యత్ వ్యవస్థకు పెట్టుబడిగా మలచుకోవచ్చని వివరించారు. నేతలు, పాలసీ మేకర్లు, ఉపాధ్యాయులు, పౌరులు దీనిని కొత్తమార్గంవైపు నడిపించాలని కోరారు. మార్పును అడ్డుకోవడం కాదు.. దాని రూపకల్పనలో మనమంతా భాగస్వాములు కావాలన్నారు.

నివేదిక విడుదల

ఈ సందర్భంగా ‘ఈజ్ ఇండియా రెడీ ఫర్ అథెంటిక్ ఏఐ’ నివేదికను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అనంతరం నారా లోకేష్ సమక్షంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ, సీఐఐ వైస్ ప్రెసిడెంట్ సుచిత్ర కె.ఎల్లాతో సీఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఐదేళ్లలో విజయవాడలో 30వేల మంది యువతకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ, కెరియర్ కౌన్సిలింగ్, ఉద్యోగాల కల్పన కోసం ఈ ఎంవోయూ చేసుకోవడం జరిగింది.

Next Story