ఏపీ రైతుల్ని కష్టాలపాలు చేస్తున్న ఆఫ్రికా నత్తలు.. నివారణ చర్యలేంటి?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-06 15:54:59  IST  )

ఏపీ రైతులకు కొత్త కష్టాలు వచ్చాయి. పలు జిల్లాల్లో ఆఫ్రికా నత్తలు పంటలను నాశనం చేస్తూ.. రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఏపీ రైతుల్ని కష్టాలపాలు చేస్తున్న ఆఫ్రికా నత్తలు.. నివారణ చర్యలేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రైతులకు కొత్త కష్టాలు వచ్చాయి. పలు జిల్లాల్లో ఆఫ్రికా నత్తలు పంటలను నాశనం చేస్తూ.. రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఆఫ్రికా నత్తలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? వీటికి పరిష్కారం ఉందా? వంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఉద్యాన పంటలను సాగుచేస్తున్న రైతులను ఆఫ్రికా నత్తలు కష్టాల్లోకి నెడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాల్లోని పంటలను పీల్చి పిప్పి చేస్తుండటంతో.. రైతులు లబోదిబోమంటున్నారు. నల్లజర్ల మండలం ఆవపాడు, ప్రకాశరావుపాలెం, ముసళ్ళగుంట, సింగరాజుపాలెం ప్రాంతాల్లోని రైతాంగం.. అధికంగా పామాయిల్, బొప్పాయి, కోకో వంటి పంటల్ని సాగుచేస్తుంది. అయితే ఈ పంటలపై ఆఫ్రికా నత్తలు దండెత్తి.. తామరతంపరగా చేరి కాండం నుంచి రసం పీల్చి వేయడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. మూడు నెలల క్రితం అక్కడక్కడా కనిపించిన ఆఫ్రికా నత్తలను చూసి, చూడనట్లు వదిలేయడంతో సమస్య పెరిగి పెద్దదైంది. చెట్ల కాండాల్లోని రసంతో పాటు.. ఆకులు, చిగురులను కూడా తినేస్తున్నాయి. మొదట అక్కడక్కడా కనిపించిన ఈ ఆఫ్రికా నత్తల్ని ఏరి తగలబెట్టారు. కానీ.. వాటి నివారణ పూర్తి కాలేదు. పురుగుమందులు పిచికారి చేసినా ఫలితం లేకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.

ఇటీవల కొందరు రైతులు వక్క సాగు చేసేందుకు.. కేరళ నుంచి వక్క మొక్కలను తీసుకొచ్చినట్లు సమాచారం. ఆ మొక్కల ద్వారానే ఆఫ్రికాజాతి నత్తలు, వాటి గుడ్లు గోదావరి జిల్లాల్లోకి వచ్చి ఉంటాయన్న అనుమానాలున్నాయి. ఆఫ్రికా నత్తల సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంటుంది. వాటి జీవితకాలం కూడా 5-6 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ద్విలింగ జాతికి చెందిన నత్తలు కావడంతో.. రెండేళ్ల వయస్సులోనే సంతానోత్పత్తి మొదలవుతుందని, ఒక్కొక్క నత్త నెలకు 100 ఏడాదికి 1000-1200 గుడ్లు పెడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా జులై నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో వీటికి సంతానోత్పత్తికి అనువైన సమయమని, రైతులంతా కలిసి ఆఫ్రికా నత్తల నివారణ చర్యలు చేపడితే తప్ప.. పూర్తిగా వాటిని నిర్మూలించడం సాధ్యం కాదని హెచ్చరిస్తున్నారు. ఒకరిద్దరు నిర్మూలన చర్యలు చేపట్టి వదిలేస్తే.. అవి పక్కతోటలోకి వెళ్లి ఆ పంటలను నాశనం చేస్తాయని తెలిపారు.

ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం రేగువలస గ్రామంలో బొప్పాయి తోటలపై ఈ నత్తలు దాడి చేయగా.. వాటిని ఉద్యాన యూనివర్శిటీ శాస్త్రవేత్తలు, కేవీకే శాస్త్రవేత్తల టీమ్ పరిశీలించింది. ఈ నత్తలు పురుగు జాతికి చెందినవి కాకపోవడం వల్లే.. వాటిపై పురుగు మందులు పనిచేయడం లేదని శాస్త్రవేత్తలు నిర్థారించారు. వాటిపై కీటక నాశన మందులు వాడాలని సూచించారు. కాపర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ మిశ్రమాన్ని నీటిలో కలిపి చెట్టుపై పిచికారి చేస్తే.. మంచి రిజల్ట్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1 లీటరు నీటిలో 15 గ్రాముల కాపర్ సల్ఫేట్, 2 గ్రాముల ఐరన్ సల్ఫేట్ ను కలిపి పిచికారి చేస్తే.. తక్షణమే 30 శాతం, మిగతా 70 శాతం నత్తలు రెండ్రోజుల్లో చనిపోతాయని సూచిస్తున్నారు.

Next Story