చిత్తూరు జిల్లాలో ఆర్ అండ్ బి ఇంజనీర్లపై చర్యలకు ఆదేశం

by Thanuru Gopichand |

చిత్తూరు జిల్లాలో ఆర్ అండ్ బీ ఇంజనీర్లపై (R&B Engineers) చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

చిత్తూరు జిల్లాలో ఆర్ అండ్ బి ఇంజనీర్లపై చర్యలకు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లాలో ఆర్ అండ్ బీ ఇంజనీర్లపై (R&B Engineers) చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రోడ్ల నిర్మాణ పనుల్లో అవినీతికి (Corruption) పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా 11 మంది ఆర్ అండ్ బీ అధికారులపై క్రమ శిక్షణ చర్యలను ప్రభుత్వం తీసుకోనుంది. అదే విధంగా పనులు చేయకుండా తీసుకున్న డబ్బును కాంట్రాక్టర్లను నుంచి రూ.97.08 కోట్లు వసూలు చేయాలని ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే

గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో నాసిరకంగా రోడ్ల నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. పీలేరు, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఆర్ అండ్ బీ శాఖలో రూల్స్‌ని అతిక్రమించి మరీ ఆరు రహదారులను విస్తరించడంతో పాటు ఓ వంతెన నిర్మించారు. 6 రోడ్లు, ఓ వంతెన నిర్మాణానికి గాను గత ప్రభుత్వ హయాంలో.. రూ.154.40 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ 6 రోడ్లలో 4 పుంగనూరు నియోజకవర్గంలోనే ఉండగా.. మరో 2 రోడ్లు ఆ ప్రాంతం మీదుగా నిర్మించారు. టెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకులకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తికి చెందిన సంస్థ దక్కించుకుని రూ.123.19 కోట్లతో ఒప్పందం చేసుకుంది.

అయితే ఈ రహదారుల నిర్మాణంపై గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అవసరం లేకుండానే రోడ్లు వేస్తున్నారని.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచారనే ఆరోపణలు వెల్లువెత్తాయి అయినా సరే అధికారులు వాటిని పట్టించుకోలేదు. క్వాలిటీ కంట్రోల్ విభాగం సైతం అంతా బాగానే ఉందంటూ నివేదిక ఇవ్వడంతో బిల్లులు చెల్లించేశారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులను బాధ్యులుగా పేర్కొంటూ 11 మంది ఆర్ అండ్ బీ ఇంజినీర్లపై ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. వారిలో ఇద్దరు ఈఈలు, ఏడుగురు ఏఈఈలు, ఇద్దరు డీఈఈలు ఉన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించి.. నిబంధనల ఉల్లంఘన, నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోలేదనే అంశాలు తెర మీదకు వచ్చాయి. దీంతో ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఆ కమిటీ అక్టోబరు 7న నివేదిక ఇవ్వగా.. దాని ప్రకారం పనులు చేయకుండా డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్ వద్ద నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా అందుకు బాధ్యులైన 11 మంది అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది.

Next Story