బల్లికురవ గ్రానైట్ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-03 09:09:19  IST  )

బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

బల్లికురవ గ్రానైట్ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు మృతి
X

దిశ ప్రతినిధి, బాపట్ల/అమరావతి, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లాలోని (Bapatla) బల్లికురవ మండలం చెన్నుపల్లి సమీపంలోని కొండాయిపాలెం వద్ద సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం (ఆగస్టు 3) సుమారు 11 గంటలకు ప్రమాదం జరిగింది. క్వారీ అంచు విరిగిపడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో 20 మందికి పైగా క్వారీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా ఉదయం పనిలోకి వెళ్లి బండరాళ్లను పగుల గొట్టే పనిలో ఉన్నారు. అకస్మాత్తుగా ఓ పెద్ద రాయి మీద పడడంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వైద్యం కోసం ఒంగోలు, అద్దంకి ఆస్పత్రులకు తరలించారు. మరికొంత మంది రాళ్ల కింద ఉన్నారని చెబుతున్నారు. రాళ్లకింద పడిన వారిని వెలికి తీసేప్రయత్నాలు జరుగుతున్నాయి. చనిపోయిన వారంతా ఒడిశాకు చెందిన వారని స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సిబ్బంది, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలోకి మీడియాను పోలీస్‌లు అనుమతించడం లేదు. ఘటనా స్థలానికి జిల్లా యస్పి తుషార్ డూడి పరిశీలనకు వెళుతున్నట్టు పోలీస్ వర్గాల సమాచారం. ప్రమాదం జరిగినట్లు చెబుతున్న పాలకొల్లు వారి క్వారీనీ ఇటీవలనే మార్టూరు గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దివ్య ఆంజనేయులు కొనుగోలు చేసి సత్య కృష్ణ గ్రానైట్‌గా పేరు మార్చినట్లు తెలుస్తోంది.

ప్రమాదంపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం

బల్లికురవ క్వారీ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం తక్షణమే అందజేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. సంఘటనపై రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, చీరాల ఆర్డివో, డివిజన్ స్థాయి ఎమ్మార్వోలు సహాయక చర్యలలో పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు.

Next Story