పలాస చేరుకున్న అభ్యుదయం సైకిల్ యాత్ర

by Thanuru Gopichand |

గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత, ప్రజలను చైతన్య పరిచేందుకు 25 మంది పోలీసు సిబ్బంది ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల పరిధిలో 1200 కిలోమీటర్ల మేర సైకిల్‌ యాత్ర చేపడు తున్నారు.

పలాస చేరుకున్న అభ్యుదయం సైకిల్ యాత్ర
X

దిశ, వెబ్ డెస్క్ : గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత, ప్రజలను చైతన్య పరిచేందుకు 25 మంది పోలీసు సిబ్బంది ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల పరిధిలో 1200 కిలోమీటర్ల మేర సైకిల్‌ యాత్ర చేపడు తున్నారు. అభ్యుదయం (Abhyudayam) పేరిట చేపడుతున్న ఈ సైకిల్ యాత్ర శనివారం శ్రీకాకుళం జిల్లాకు (Srikakulam) చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని పలాసలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఇందిరా చౌక్ నుంచి రైల్వే గ్రౌండ్ వరకు సాగిన ర్యాలీకి ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. అభ్యుదయం యాత్రకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో.. భవిష్యత్తు ముద్దు బ్రో పేరిట పోలీసు శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అన్నారు. అందులో భాగంగా సైకిల్ యాత్రను చేపట్టామన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల అలవాట్లు, వారి ప్రవర్తన పట్ల దృష్టి సారించాలన్నారు. ఒకవేళ వారు మత్తు పదార్థాల బారినపడితే వారు కోలుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి సమాచారాన్ని 1972 నెంబరుకు అందించాలన్నారు. తద్వారా వారికి మత్తు నుంచి విముక్తి కల్పించే వీలు కలుగుతుందన్నారు. తమ సంకల్పంలో ప్రజలంతా భాగస్వాములై డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం సాకారం చేయాలని పిలుపునిచ్చారు.

పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు సాగుతున్న అభ్యుదయం యాత్ర ఈ నెల 29న ఇచ్చాపురంలో ముగియాల్సి ఉందని శ్రీకాకుళం ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఇటీవల తెలిపారు. యాత్ర విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో ముగింపు సభను జనవరి 3న ఇచ్చాపురంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. సైకిల్ యాత్రలో విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా తమ మద్దతు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటూనే, ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు.

Next Story