శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం.. కన్నబిడ్డల గొంతుకోసి చంపి, తల్లి ఆత్మహత్యాయత్నం

by Ramesh Naini |

కన్నతల్లే కాలయమురాలైంది. పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను అతికిరాతకంగా గొంతుకోసి చంపిందో మహిళ. అనంతరం తానూ అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం.. కన్నబిడ్డల గొంతుకోసి చంపి, తల్లి ఆత్మహత్యాయత్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కన్నతల్లే కాలయమురాలైంది. పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను అతికిరాతకంగా గొంతుకోసి చంపిందో మహిళ. అనంతరం తానూ అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ అత్యంత విషాదకరమైన దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెదుళ్లవలస గ్రామానికి చెందిన కూర్మారపు వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులు భవాని (4), మరో రెండేళ్ల చిన్నారి గొంతులు కోసి దారుణంగా హత్య చేసింది. పసికందులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం అదే కత్తితో వరలక్ష్మి తన గొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది.

ఈ ఘోరాన్ని గమనించిన గ్రామస్థులు భయాందోళనలకు గురై వెంటనే 108 అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వరలక్ష్మిని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (రిమ్స్) తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కన్నబిడ్డలను చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడేంత కఠిన నిర్ణయం వరలక్ష్మి ఎందుకు తీసుకుంది? కుటుంబ కలహాలా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. పసిపిల్లల దారుణ మృతితో వెదుళ్లవలస గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story