శ్రీకాళహస్తిలో తమిళ వ్యక్తి హల్ చల్

by Thanuru Gopichand |

శ్రీకాళహస్తిలో తమిళ వ్యక్తి హల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలో తమిళ వ్యక్తి హల్ చల్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో (Srikalahasthi) తమిళనాడుకు చెందిన అన్నాదొరై (Annadurai) అనే వ్యక్తి హఠాత్తుగా వీరంగం సృష్టించాడు. దేవాలయం వెలుపల ఉన్న సిసి కెమెరాలను ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడ పార్క్ చేసి ఉన్న కార్ల అద్దాలను పగులగొట్టేందుకు యత్నించాడు. ఆ వ్యక్తి ప్రవర్తనతో భయాందోళనకు గురైన భక్తులు, స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. గమనించిన ఆలయ భద్రతా సిబ్బంది అతడిని చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ అనూహ్య ఘటనతో ఆలయ పరిసరాల్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

​అదుపులోకి తీసుకున్న అన్నాదొరైని పోలీసులు తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతడి వద్ద నుంచి భారీ సంఖ్యలో డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు అనేక బ్లేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ కార్డులు ఎక్కడివి? అతను బ్లేడ్లను ఎందుకు దగ్గర ఉంచుకున్నాడు? ఆలయ పరిసరాల్లో అలజడి సృష్టించడానికి గల కారణాలేమిటి? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సదరు వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఇలా చేశాడా లేక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Next Story