పాపికొండల ప్రకృతి ఒడిలో హాయ్‌గా..! డ్రోన్ కెమెరాకు చిక్కిన రాయల్ బెంగాల్ టైగర్

by Ramesh Naini |

గోదావరి తీరంలోని పాపికొండల నేషనల్ పార్క్ ఇప్పుడు ఒక అరుదైన దృశ్యానికి వేదికైంది. దట్టమైన ఏజెన్సీ అడవుల్లో ఒక రాయల్ బెంగాల్ టైగర్ సేద తీరుతున్న దృశ్యాలు డ్రోన్ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

పాపికొండల ప్రకృతి ఒడిలో హాయ్‌గా..! డ్రోన్ కెమెరాకు చిక్కిన రాయల్ బెంగాల్ టైగర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోదావరి తీరంలోని పాపికొండల నేషనల్ పార్క్ ఇప్పుడు ఒక అరుదైన దృశ్యానికి వేదికైంది. దట్టమైన ఏజెన్సీ అడవుల్లో ఒక రాయల్ బెంగాల్ టైగర్ సేద తీరుతున్న దృశ్యాలు డ్రోన్ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ అరుదైన దృశ్యాలు అటవీ శాఖాధికారులు తాజాగా వీడియో విడుదల చేశారు. పాపికొండల ప్రకృతి ఒడిలో హాయ్‌గా చిన్న పిల్లి మాదిరి నిద్రిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సంచరిస్తున్నది సుమారు 3.5 ఏళ్ల వయస్సున్న మగ పులి. ఫిబ్రవరి 6న తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామ పొలాల్లో పట్టుబడిన ఈ పులిని, పుణెకు చెందిన స్వచ్ఛంద సంస్థ (RESQ) సహకారంతో బంధించి, రేడియో కాలర్ అమర్చి పాపికొండల అడవుల్లో విడిచిపెట్టారు. ఈ యువ పులి ప్రస్తుతం తనకంటూ ఒక కొత్త సామ్రాజ్యాన్ని (Territory) ఏర్పరుచుకునే పనిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రేడియో కాలర్ ద్వారా దీని కదలికలను ఫారెస్ట్ అధికారులు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ప్రతినిధులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. అడవి అంచున ఉన్న గ్రామాల్లో పశువులపై దాడి చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు మనుషులపై ఎలాంటి దాడులు చేయకపోవడం ఊరటనిచ్చే అంశం.

త్వరలో 'జత' కలయిక?

ఈ మగ పులి ఒంటరిగా ఉండటంతో పాటు తోడు కోసం వెతుకుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడుగా సుమారు రెండేళ్ల వయస్సున్న, యుక్తవయస్సుకు వచ్చిన ఒక ఆడ పులిని అదే అడవిలో విడిచిపెట్టాలని ఏపీ అటవీ శాఖ యోచిస్తోంది. దీనివల్ల పాపికొండల ప్రాంతంలో పులుల సంఖ్య పెరిగి, పులుల సంతతికి ఈ అడవి ఒక సురక్షిత నివాసంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

Next Story