ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి సరికొత్త నాంది: సీఎం

by Thanuru Gopichand |

ఏపీలో పెట్టుబడులకు ఊపు. కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభం.

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి సరికొత్త నాంది: సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) హర్షం వ్యక్తం చేశారు. నూతన సంవత్సర ఆరంభంలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం శుభపరిణామమని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గర్వకారణమని ఆయన తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంచేలా ప్రవేశపెట్టిన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Speed of Doing Business) కార్యక్రమం, పారదర్శకమైన విధానాలు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయని తెలిపారు. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల పంపిణీలో జాప్యం లేకుండా, పారదర్శకత కోసం దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన 'ఎస్క్రో ఆధారిత మెకానిజం' (Escrow-based mechanism) ద్వారా పెట్టుబడిదారులకు భరోసా లభిస్తోందన్నారు. దీనివల్ల నిర్ణీత సమయంలోనే ప్రోత్సాహకాలు నేరుగా అందుతాయని సీఎం స్పష్టం చేశారు.

​రాష్ట్ర అభివృద్ధిపై తమకున్న స్పష్టమైన విజన్‌ను నమ్మి ఆంధ్రప్రదేశ్‌ను తమ వ్యాపార గమ్యస్థానంగా ఎంచుకున్న పెట్టుబడిదారులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రంగాల వారీగా ప్రత్యేక పారిశ్రామిక విధానాలను తీసుకురావడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని పేర్కొ్న్నారు. ఈ విజయానికి ప్రభుత్వ యంత్రాంగం చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. అయితే ఈ మైలురాయి ప్రగతికి ఆరంభం మాత్రమేనని తెలిపారు. రాబోయే రోజుల్లో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి పథంలో నడిపిస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా.. ప్రతి ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా కఠినమైన పర్యవేక్షణ ఉంటుందన్నారు. తద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు.

Next Story