సమాజంపై అపూర్వమైన ప్రభావం చూపిన మహనీయుడు : ముఖ్యమంత్రి

by Thanuru Gopichand |   (  Updated:2025-11-16 05:33:10  IST  )

ప్రముఖ వ్యాపారవేత్త.. మీడియా దిగ్గజం పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీ రావుకు (Ramoji Rao) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు.

సమాజంపై అపూర్వమైన ప్రభావం చూపిన మహనీయుడు : ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ వ్యాపారవేత్త.. మీడియా దిగ్గజం పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీ రావుకు (Ramoji Rao) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. రామోజీ రావు జయంతిని (Birth Anniversary) పురస్కరించుకొని ఆయనను స్మరించుకున్నారు. పద్మవిభూషణ్ రామోజీరావు తెలుగు వెలుగు అని కొనియాడారు. నిష్పక్షపాత జర్నలిజానికి నూతన ప్రమాణాలను రామోజీ రావు ఏర్పరిచారని గుర్తు చేసుకున్నారు. ఈనాడు సంస్థల ద్వారా సమాజంపై అపూర్వమైన ప్రభావం చూపిన మహనీయుడని కొనియాడారు. వ్యాపారాల్లో సైతం ప్రజాహితం, విలువలు, నైతికతను ప్రతిష్టించిన అరుదైన దార్శనికులు రామోజీ రావు అన్నారు. రామోజీ రావు జయంతి సందర్భంగా ఆయన చూపిన మార్గాన్ని శాశ్వత స్ఫూర్తిగా మలచుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) పిలుపునిచ్చారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి : మంత్రి నారా లోకేష్

బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు శిఖరం రామోజీరావు జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. కృషి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని తెలిపారు. సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగారన్నారు. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకునిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. రామోజీరావు పేరు వింటేనే తెలుగువారందరికీ స్ఫూర్తి లభిస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలిచిన రామోజీరావు సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందామని తెలిపారు.

రామోజీరావు అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తెలుగు శిఖరం. ఆయన జీవితమే ఒక పోరాటం. ప్రతి పోరాటం ఒక గెలుపు పాఠం. ఆయన ఆలోచన నిత్యనూతనం. నిరంతర అధ్యయనం రామోజీ నైజం. వేయి బాహువులు, వేయి మెదళ్ల కలయికతో చేసే పని ఒక్కడే చేయగల సమర్థుడు. సంస్థల నిర్మాణంలో బాహుబలి. బృందంలో అచంచల విశ్వాసం నింపే నాయకుడు. ధర్మాగ్రహమే ఆయుధంగా వ్యవస్థలను ఢీకొట్టిన ధీశాలి. ఒక వ్యక్తి జీవితకాలంలో ఇన్ని వైవిధ్యమైన పనులు చేయగలరా? ఇన్ని విజయాలు సాధించగలరా? అని ఆశ్చర్యపోయే విజయ ప్రస్థానం రామోజీరావు సొంతం.

Next Story