- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతీయురాలిగా కన్నుమూయాలన్నదే నా చివరి కోరిక.. కలెక్టర్ వద్ద వృద్ధురాలు భావోద్వేగ విజ్ఞప్తి
సొంత ఊరిపై, మాతృభూమిపై ఉన్న మక్కువతో 94 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు అమెరికా పౌరసత్వాన్ని (US Citizenship) వదులుకుని, తిరిగి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: సొంత ఊరిపై, మాతృభూమిపై ఉన్న మక్కువతో 94 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు అమెరికా పౌరసత్వాన్ని (US Citizenship) వదులుకుని, తిరిగి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసింది. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన కొండ్రగుంట మహాలక్ష్మమ్మ కథ ఇది.
అసలేం జరిగిందంటే..
మహాలక్ష్మమ్మ భర్త నాగభూషణం మరణించిన తర్వాత, అమెరికాలోని వర్జీనియా (పీటర్స్ బర్గ్)లో క్యాన్సర్ నిపుణుడిగా (Oncologist) పనిచేస్తున్న తన కుమారుడు డాక్టర్ కొండ్రగుంట బుచ్చయ్య చౌదరి వద్దకు ఆమె వెళ్లారు. అక్కడ నివసిస్తూ జూలై 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందారు. దాదాపు 18 ఏళ్ల పాటు అమెరికాలోనే గడిపిన ఆమె, 2018లో తన కుమారుడు మంగళగిరిలోని ఎన్నారై (NRI) హాస్పిటల్లో చేరడంతో కుటుంబంతో కలిసి తిరిగి మాతృభూమికి వచ్చేసి చింతగుంపల గ్రామంలోనే స్థిరపడ్డారు.
కలెక్టర్ వద్ద భావోద్వేగ విజ్ఞప్తి..
తన చివరి రోజులను పుట్టిన గడ్డపైనే గడపాలని నిశ్చయించుకున్న మహాలక్ష్మమ్మ.. ఇప్పటికే తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. తిరిగి భారత పౌరసత్వం పొందడం కోసం ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు సంబంధించిన అధికారిక విచారణలో భాగంగా తన కుమారుడితో కలిసి బాపట్ల జిల్లా కలెక్టర్‌ను కలిసి భావోద్వేగంగా అభ్యర్థించారు. "కలెక్టర్ గారు.. నాకు ఇప్పుడు 94 ఏళ్లు నిండి 95వ సంవత్సరం వస్తోంది. నా మాతృభూమిలోనే భారతీయ పౌరురాలిగా నా చివరి రోజులు గడపాలని, నేను పుట్టిన ఊరిలోనే నా అంత్యక్రియలు జరగాలని కోరుకుంటున్నాను. దయచేసి నాకు త్వరగా భారత పౌరసత్వం వచ్చేలా సహాయం చేయండి." అని చేతులు జోడించి వేడుకున్నారు. భారత పౌరసత్వం లభిస్తే దేశ రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి ఉంటానని ఆమె ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్.. నిబంధనల ప్రకారం విచారణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, నివేదికను రాష్ట్ర సచివాలయానికి పంపుతామని, అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం కోసం సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు.






