ఆత్మగౌరవ నినాదానికి 44 ఏళ్లు.. నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-29 04:50:41  IST  )

తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో స్థాపించిన పార్టీ టీడీపీ. ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, అపజయాలు ఎదుర్కొన్న పార్టీ.. విజయాల పరంపర కూడా కొనసాగించింది.

ఆత్మగౌరవ నినాదానికి 44 ఏళ్లు.. నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ.. తెలుగువారి కోసం స్థాపించిన పార్టీ. ఈ పార్టీ పురుడుపోసుకుని నేటికి 44 వసంతాలు పూర్తయి.. 45వ ఏటలోకి అడుగు పెడుతోంది. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకూ ఎన్నో ఆటుపోట్లు, వేధింపులను తట్టుకుని నిలబడింది. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతకు టీడీపీ ఓ మార్గం చూపించిందనడంలో సందేహం లేదు. 1982 మార్చి 29న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆనాడు ఆయన విత్తిన బీజం నేడు మహావృక్షమై తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ప్రభంజనం

1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 60 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. "తెలుగువారి ఆత్మగౌరవం" అనే నినాదంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, చైతన్య రథంపై రాష్ట్రమంతటా పర్యటించి ప్రజల్లో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని దక్కించుకుని, దేశ రాజకీయాల్లోనే ఒక రికార్డు సృష్టించారు. 1983 జనవరి 9న ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ తొలిపోటీలో నిలబడిన అభ్యర్థుల్లో 28 మంది పోస్టు గ్యాడ్యుయేట్లు, 20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, 8 మంది ఇంజినీర్లు, 128 మంది పట్టభద్రులు ఉన్నారు.

సంక్షేమ పథకాలకు ఆద్యుడు 'అన్న' ఎన్టీఆర్

పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 రూపాయలకే కిలో బియ్యం పథకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనితో పాటు జనతా వస్త్రాలు, పక్కా గృహాల నిర్మాణం, వితంతువులకు పెన్షన్లు వంటి వినూత్న పథకాలను అమలు చేసి 'అన్న'గా పేదల గుండెల్లో నిలిచిపోయారు. అలాగే.. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, మండల వ్యవస్థను తీసుకురావడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు పార్టీని ప్రజలకు మరింత చేరువ చేశాయి. అంతేకాదు మహిళల కోసం తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ, తెలుగు భాషను ప్రోత్సహించేందుకు తెలుగు విశ్వవిద్యాలయం, దేశంలో తొలిసారిగా ప్రత్యేక వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. పటేల్, పట్వారీ వ్యవస్థల్ని రద్దు చేసింది కూడా టీడీపీ ప్రభుత్వమే. అందరికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించారు.

చంద్రబాబు నాయకత్వంలో హైటెక్ విప్లవం

1995లో నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను చేపట్టిన తర్వాత టీడీపీ రూపురేఖలు మారిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో నిలబెట్టిన 'హైటెక్ సిటీ' నిర్మాణం ఆయన దార్శనికతకు నిదర్శనం. జన్మభూమి, పొదుపు సంఘాల (డ్వాక్రా) బలోపేతం వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేశారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా ఆయన రికార్డు సృష్టించారు.

జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా టీడీపీ

కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా, జాతీయ రాజకీయాల్లోనూ టీడీపీ కింగ్ మేకర్‌గా వ్యవహరించింది. ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో, అనంతరం చంద్రబాబు నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే ప్రభుత్వాల ఏర్పాటులో పార్టీ కీలక భూమిక పోషించింది. లోక్‌సభ స్పీకర్‌గా జి.ఎం.సి. బాలయోగి ఎంపిక కావడం, రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తెలుగువారి గళాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించింది.

నవ్యాంధ్ర నిర్మాణం - పార్టీకి కొత్త ఊపిరి

రాష్ట్ర విభజన తర్వాత 2014లో నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి, అమరావతిని రాజధానిగా నిర్మించేందుకు కృషి చేశారు. అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం 2024 ఎన్నికల తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. యువనేత నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ద్వారా పార్టీకి కొత్త ఊపిరి పోశారు. 44 ఏళ్ల ఈ ప్రస్థానంలో ఎన్నో విజయాలు, అపజయాలను చూసినప్పటికీ, తెలుగు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ తన పయనాన్ని కొనసాగిస్తోంది.

Next Story