- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పడిలేచిన కెరటం.. సీఎం నారా చంద్రబాబు నాయుడు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు .. తొలిసారి సీఎంగా పదవీప్రమాణం చేసి నేటికి 30 సంవత్సరాలు పూర్తయింది.

దిశ, డైనమిక్ బ్యూరో : నారా చంద్రబాబు నాయుడు.. ఆ పేరు నేటి తరానికి ఒక స్ఫూర్తి. రాజకీయాల్లో ఎదగాలనుకునేవారికి ఒక ధైర్యం. నాటి హైటెక్ సిటీ నుంచి నేటి క్వాంటమ్ వ్యాలీ వరకూ.. ఫ్యూచర్ విజన్ తో ఒక సీఎంగా టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కించిన ఘనత ఆయనకే సొంతం. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. పడిలేచిన కెరటంలా పాలనలో తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. 1995లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. అప్పుడు ఆయన వయసు 45 సంవత్సరాలు. అతి చిన్న వయసుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో రెండో వ్యక్తిగా నిలిచారు. సీఎంగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. 30 ఏళ్లలో సీఎంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసిన సంస్కరణలు తదితర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1995లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. రెండోసారి 1999లో జరిగిన ఎన్నికల్లో 181 సీట్లలో విజయం సాధించి సీఎం పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత వరుసగా 2004, 2009 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమిపాలయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ సీఎం అయ్యారు. కానీ.. ఈసారి విభజిత ఆంధ్రప్రదేశ్ కు, రాజధాని లేని రాష్ట్రానికి, లోటు బడ్జెట్ ఉన్న స్టేట్ కు సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
అన్నీ ఉన్న రాష్ట్రాన్ని సీఎంగా పరిపాలించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ.. రాజధాని లేని రాష్ట్రాన్ని సీఎంగా పాలించడం, రాజధాని నిర్మాణం, ఆ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, ఉద్యోగాలు, విద్య.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్న రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టడమంటే కత్తిమీద సామువంటిదేనని చెప్పాలి. ఆ సమయంలో ఆయన ముందున్న, మైండ్ లో ఉన్న లక్ష్యం రాష్ట్రానికి రాజధానిని నిర్మించడం. అందుకు ఆయన విజన్ తో కేంద్రంతో చర్చలు జరిపి రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకొచ్చారు. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో రాజధాని నిర్మాణంతో పాటు ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల అమలు కూడా ఆగిపోయింది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం, ఉద్యోగాల కల్పన ఇలా అన్నింటిలోనూ తన మార్క్ పాలనను చూపిస్తున్నారు.
1995లో ఎన్టీఆర్ స్థానంలో ఆయన అనూహ్యంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీపై, ఎన్టీఆర్ పై తమకెంత అభిమానం ఉందో ఓట్ల రూపంలో చూపించారు ప్రజలు. విద్యార్థి దశనుంచే రాజకీయాల పట్ల ఎంతో చురుగ్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు.. 30 ఏళ్ల కాలంలో మూడు ఓటములు, నాలుగు విజయాలను అందుకున్నారు. ఒక సీఎం తలచుకుంటే టెక్నాలజీతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చో చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ. కొండలు, వాటిపై పచ్చని బైళ్లతో నిండి ఉన్న ప్రాంతంలో 14 నెలల్లో హైటెక్ సిటీని నిర్మించి.. 1998 నవంబర్ 22న నాటి ప్రధాని వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. నేడు అదే హైటెక్ సిటీ.. ఐటీ ఉద్యోగాల భాండాగారంగా ప్రసిద్ధి చెందింది. ఐటీ సెక్టార్ అంటే హైటెక్ సిటీ అనే స్థాయికి చేరింది.
1997 జనవరి 1న ఆయన అమలు చేసిన జన్మభూమి పథకం అన్నదాతల్లో ఆనందాన్ని నింపింది. 1999లో చంద్రబాబు హయాంలోనే రైతు బజార్లు వచ్చాయి. ఆయన తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి కోటివరాల ప్రకటన. బడుగు, బలహీన వర్గాలకు ఇళ్లు, ఇళ్లపట్టాలు, రేషన్ కార్డులు, దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, మైనార్టీలకు దుకాన్ ఔర్ మకాన్, పేద ఆడపిల్లలకు ఉచిత సైకిళ్లు.. ఇలా ఎన్నో పథకాలు ఆ వరాల్లో ఉన్నాయి. మహిళల అభ్యున్నతి కోసం డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. మహిళ ఆర్థిక సాధికారతకు డ్వాక్రా ఎంతో తోడ్పడింది. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రుణాల మాఫీతో డ్వాక్రా మహిళలు లబ్ధిపొందారు. ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బుతో ఎంతోమంది సొంతంగా వ్యాపారాలు పెట్టుకుని రాణిస్తున్నారు. 2014లో సీఎంగా పగ్గాలు చేపట్టాక రాజధాని శంకుస్థాపనతో పాటు.. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని కాపాడుకునేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. అలా పుట్టిన ప్రాజెక్టే పట్టిసీమ. పోలవరాన్ని రైతులకు వరంగా ఇచ్చారు.
ప్రస్తుతం ఆయన ముందున్న లక్ష్యాలు రాజధానిని నిర్మించడం, స్వర్ణాంధ్ర విజన్ - 2047. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచమంతా తిరిగి చూసేలా నిర్మిస్తానని ఇప్పటికే పలుమార్లు చెప్పిన సీఎం చంద్రబాబు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
Also Read.. Nara Chandrababu Naidu : నారా చంద్రబాబు అనే నేను..






