చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర.. గిన్నిస్ రికార్డులు సైతం బ్రేక్!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-20 07:23:40  IST  )

ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ( International Yoga Day) పురస్కరించుకుని విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది.

చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర.. గిన్నిస్ రికార్డులు సైతం బ్రేక్!
X

దిశ, వెబ్ డెస్క్: ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ( International Yoga Day) పురస్కరించుకుని విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రపంచ రికార్డు సృష్టించేలా సాగరతీరంలో లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు రంగం సిద్ధం చేసింది. 'యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్ (Yoga for One Earth-One Health)' నినాదంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలంతా కలిసి రావాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) పిలుపునిచ్చారు. విశాఖలో 26 కిలోమీటర్లు పరిధిలో 3 లక్షల 19 వేల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా 1.29 లక్షల ప్రాంతాల్లో 2 కోట్ల మందికి పైగా యోగాసనాలు వేయనున్నారని వివరించారు. యోగాంధ్రలో భాగంగా గత నెల 21 నుంచి ఈనెల 21 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

అలాగే, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 22 రికార్డులను బద్దలు కొట్టబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 20, గిన్నిస్ బుక్‌కు సంబంధించి రెండు రికార్డులు ఉన్నాయని చెప్పారు. ఒకేసారి 2 కోట్ల మందికి పైగా యోగా చేయడం ద్వారా ఒక రికార్డు, ఒకే ప్రదేశంలో 3 లక్షల మంది యోగా చేసి మరో రికార్డు సృష్టించనున్నట్టు వివరించారు. 25 వేల మంది గిరిజన విద్యార్థులతో 1.08 నిమిషాల్లోనే 108 సూర్య నమస్కారాలు చేయించి రికార్డులను బద్దలు కొట్టబోతున్నట్లు సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి 'యోగిఫై' మ్యాట్‌‌ను తయారు చేయడం అద్భుతమని కొనియాడారు. ప్రత్యేక యాప్ ద్వారా పనిచేసే ఈ మ్యాట్, ఆసనాలు వేసే సమయంలో మార్గదర్శనం చేస్తుందని, ఒకసారి చార్జింగ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు.

Next Story