ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సాయిప్రసాద్.. ట్రాక్ రికార్డ్ ఇదే

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-28 06:58:51  IST  )

ఏపీ నూతన చీఫ్ సెక్రటరీగా జి. సాయిప్రసాద్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు.

ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సాయిప్రసాద్.. ట్రాక్ రికార్డ్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి. సాయిప్రసాద్ శనివారం ఉదయం 11.33 గంటలకు సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. నిన్నటి వరకూ ప్రభుత్వ సీఎస్ గా ఉన్న కె.విజయానంద్ స్థానంలో సాయిప్రసాద్ నియమితులయ్యారు. విజయానంద్ ఉద్యోగ విరమణ అనంతరం ఆయన విధుల్లోకి వస్తారని పేర్కొంటూ గతేడాది నవంబర్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన సాయ్ప్రసాద్.. 1991లో ఐఏఎస్ పాసయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కీలక పదవులు నిర్వహించారు.

1992 నుంచి 1993 వరకూ వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్ గా, 1993-95 వరకూ పాడేరు అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత 1995-97 వరకూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వహించారు. 2000-2003 వరకూ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా, 2003 జూన్ నుంచి అక్టోబర్ వరకూ చిత్తూరు జిల్లా కలెక్టర్ గా, అదే ఏడాది అక్టోబర్ నుంచి 2004 ఆగస్టు వరకూ ఏపీ ట్రాన్స్ కో జేఎండీగా పనిచేశారు. 2004 ఆగస్టు నుంచి 2006 మే నెల వరకూ ఈపీడీపీసీఎల్ సీఎండీగా, 2006 మే నుంచి 2010 ఫిబ్రవరి వరకూ ఏపీ సీపీడీసీఎల్ సీఎండీగా విధులు నిర్వహించారు.

2010 ఫిబ్రవరి-2011 అక్టోబర్ వరకూ ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా పనిచేశారు. 2011 అక్టోబర్ నుంచి 2014 జూన్ వరకు కేంద్రప్రభుత్వ ఇంధనశాఖ సంయుక్త కార్యదర్శిగా, 2014 జూన్ నుంచి 2016 ఫిబ్రవరి వరకూ సీఎం కార్యదర్శిగా, ఆ తర్వాత 2019 మే వరకూ సీఎం ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. 2020 జనవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెట్‌కు సీఎండీగా, 2022 ఫిబ్రవరి నుంచి 2024 జూన్ వరకు సీసీఎల్ఏగా, 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు జలవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌ విధులు నిర్వర్తించారు. 2025 జనవరి నుంచి అదే హోదాలో పనిచేస్తూ సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వీటితోపాటు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

Next Story