- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త ప్రాణానికి 14 తులాల ‘సుపారీ’.. ప్రియుడితో కలిసి భార్య కిరాతకం! వెలుగులోకి సంచలన నిజాలు
వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ఓ భార్య పన్నిన పన్నాగం కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ఓ భార్య పన్నిన పన్నాగం కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపింది. తన సుఖానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ఏకంగా ఇంట్లోని 14 తులాల బంగారాన్ని సుపారీగా ఇచ్చి కిరాయి ముఠాను రంగంలోకి దించింది. అయితే బాధితుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో ఈ కిరాతక కుట్ర వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి, శిల్పారెడ్డి దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా శిల్పారెడ్డికి, జిల్లా ఆసుపత్రిలో పనిచేసే జమ్మలమడుగు వాసి నాగసుధీర్‌తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి భార్యను పలుమార్లు మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను శాశ్వతంగా తొలగించుకోవాలని ఆమె ప్రియుడితో కలిసి నిర్ణయించుకుంది.
రూ. 10 లక్షలకు డీల్..
భర్తను చంపేందుకు ప్రియుడు నాగ సుధీర్, ఓ రౌడీషీటర్ వినయ్ సాయంతో హిందూపురానికి చెందిన కిరాయి ముఠాతో రూ. 10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. సుపారీ డబ్బుల కోసం శిల్పారెడ్డి ఇంట్లోని 14 తులాల బంగారాన్ని ప్రియుడికి ఇచ్చింది. ఆ బంగారాన్ని కుదవపెట్టి, విక్రయించిన నాగసుధీర్.. ముఠాకు రూ. 5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు.
సినిమా ఫక్కీలో దాడి.. తప్పించుకున్న భర్త..
పథకం ప్రకారం ఈశ్వర్‌రెడ్డి కదలికలను భార్య శిల్పారెడ్డి ఎప్పటికప్పుడు ప్రియుడికి, కిరాయి ముఠాకు చేరవేసింది. బుధవారం బైక్‌పై వెళ్తున్న ఈశ్వర్‌రెడ్డిని ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో కిరాయి ముఠా కారుతో బలంగా ఢీకొట్టింది. కిందపడిన వెంటనే కత్తులతో దాడికి యత్నించగా.. అదృష్టవశాత్తూ ఈశ్వర్‌రెడ్డి ప్రాణాలతో వారి నుంచి తప్పించుకుని నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ కుట్ర వెనుక భార్య శిల్పారెడ్డి, ఆమె ప్రియుడు నాగసుధీర్ ఉన్నట్లు గుర్తించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, ప్రధాన నిందితులతో పాటు కిరాయి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






