- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడప రిమ్స్ వద్ద దారుణం.. వైసీపీ కార్యకర్త హత్య కేసులో 11 మంది అరెస్ట్
వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి (రిమ్స్) ఆవరణలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి దారుణ హత్య కేసుకు సంబంధించి పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి (రిమ్స్) ఆవరణలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి దారుణ హత్య కేసుకు సంబంధించి పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. ఈ నెల 5వ తేదీ రాత్రి జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన రాజా, రవితో పాటు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప శివారు ప్రాంతమైన ఆలంఖాన్‌పల్లెకు చెందిన పెద్దదస్తగిరి (53) స్థిరాస్తి వ్యాపారం చేస్తుండేవాడు. ఈ నెల 4వ తేదీన స్థానికంగా జరిగిన మారెమ్మ జాతరలో ఏర్పాటు చేసిన డీజే వద్ద ఆయన కుమారుడు వెంకటదస్తగిరికి, అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంకటదస్తగిరి ద్వారా విషయం తెలుసుకున్న పెద్ద దస్తగిరి.. స్వయంగా డీజే వద్దకు వెళ్లి గొడవలు పడవద్దని ఇరువర్గాలకు సర్దిచెప్పి వచ్చారు. అయితే, ఈ వివాదం అక్కడితో సద్దుమణగలేదు. మరుసటి రోజు, 5వ తేదీ (ఆదివారం) రాత్రి వెంకటదస్తగిరి మారెమ్మ ఆలయం వద్ద నుంచి వెళ్తుండగా.. కక్ష పెంచుకున్న వెంకటేష్ మరికొంత మంది యువకులతో కలిసి వెంటాడి అతనితో పాటు బంధువులపై దాడికి దిగాడు. ఈ దాడిలో సిద్దయ్య, మౌలాలమ్మ, కె.దస్తగిరి తీవ్రంగా గాయపడగా.. పెద్ద దస్తగిరి, అతని సోదరుడు చిన్న దస్తగిరిలకు స్వల్ప గాయాలయ్యాయి.
ఆసుపత్రి వద్ద కాపుకాచి కిరాతకం..
దాడిలో గాయపడిన వారికి వైద్యం చేయించేందుకు పెద్ద దస్తగిరి, అతని సోదరుడు చిన్న దస్తగిరిలు అర్ధరాత్రి 12 గంటల సమయంలో కడప రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే ఆస్పత్రి ఆవరణలో కాపుకాచి ఉన్న పది మందికి పైగా యువకులు వారిద్దరినీ చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. ఈ కిరాతక దాడిలో పెద్ద దస్తగిరి శరీరంపై పదికి పైగా కత్తిపోట్లు పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన సోదరుడు చిన్నదస్తగిరికి ఛాతీ పక్క భాగంలో కత్తిపోటు తగిలినప్పటికీ, ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను పట్టుకున్నారు.






