ఏప్రిల్ నుంచి ఏపీ @ వైజాగ్

by  |

ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్ కేంద్రంగా ప్రభుత్వం ఏప్రిల్ నుంచి విధులు నిర్వర్తించనుంది. రాజధాని అంశంపై టీడీపీ నానాయాగీ చేస్తున్న నేపథ్యంలో విశాఖపట్టణం కేంద్రంగా పరిపాలన సాగించడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని రాజకీయానికి ఏప్రిల్ నుంచి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్టణానికి అన్ని అర్హతలు ఉన్నాయన్న విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, నేతలు అంతా అంగీకరిస్తారు.. అయితే ఎలాగూ అభివృద్ధి చెందే వైజాగ్‌ను రాజధాని పేరిట అభివృద్ధి చెయ్యాల్సిని పని లేదని, అమరావతిని అభివృద్ధి చేస్తే సరిపోతుందని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ప్రత్యేక నిధుల కేటాయింపు అదనపు భారంగా మారుతుందని.. అందుకే ఇప్పటికే అన్ని సౌకర్యాలున్న వైజాగ్‌ను పూర్తిగా వినియోగించుకుంటే రాజధాని అన్న పదానికి న్యాయం చేసినవారవుతామని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. అయితే రెండు పార్టీలు పట్టువీడడం లేదు. ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి వైజాగ్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధులు చేపట్టనుంది.

ఈ మేరకు పలువురు మంత్రులు తమతమ శాఖలకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల అనంతరం వైజాగ్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం విధులు నిర్వర్తించనుంది. ఇప్పటికే వైజాగ్‌లో ఆయా శాఖలకు సంబంధించిన కార్యాలయాల అన్వేషణ పూర్తైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో డిజిటలైజేషన్ రికార్డులు ఉన్నందున కార్యాలయాల తరలింపు కూడా పెద్ద కష్టం కాదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజధాని విశాఖపట్టణం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధులు నిర్వర్తించనుంది.

Next Story