ప్రజాస్వామ్య రక్షణ కోసం మోడీని ఓడించాలి : కోదండరామ్

ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో

Update: 2024-05-11 10:12 GMT

దిశ,హుజురాబాద్ రూరల్: ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ,నరేంద్ర మోడీ ని ఓడించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో "ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం" అనే సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బడుగు ,బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయానికి మన రాజ్యాంగం పెద్దపీట వేసిందని, అలాంటి రాజ్యాంగాన్ని రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రమాదంలో పడవేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పది సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో పౌరహక్కులు అడుగంటి పోయాయని ,కులవివక్ష ,మతతత్వం, నిరంకుశత్వం, రెట్టింపు అయిందని అన్నారు. ప్రజల్లో, మైనార్టీలో ద్వేషం పెంచుతూ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి, కార్మిక చట్టాలను రద్దు చేయడం ,జీఎస్టీతో ప్రతి వస్తువు పై పన్ను వేయడమే నరేంద్ర మోడీ పాలన అని ఎద్దేవా చేశారు.

వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని జరిగిన రైతుల ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగించి వందలాది మంది రైతుల చావుకు కారణమైన నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగం అదానీ అంబానీల చేతుల్లోకి వెళుతుందన్నారు. నరేంద్ర మోడీ పాలనలో అదానీ అంబానీలా ఆస్తులు లక్షల కోట్లకు పెరిగిపోయాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం ,సహజ వనరులైన అడవులు ఖనిజ సంపదలను విద్యాసం చేస్తూ దోపిడీకి పాల్పడడం మోడీ ప్రభుత్వం అండగా నిలిచిందని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, పేదలపై జీఎస్టీ, తగ్గిన జీడీపీ వృద్ధి కారణంగా దేశంలోని మెజార్టీ ప్రజల భవిష్యత్తు గందరగోళంలో పడిందని అన్నారు .

తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉంటారో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని, దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర విభజన హామీలను అమలు పరచడం కోసం మత సామరస్యాన్ని కాపాడుకోవడం, రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు .ఈ సమావేశంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు అంబటి నాగయ్య, ముక్కెర రాజు, కన్నెగంటి రవి, పరకాల ప్రభాకర్, వేల్పుల రత్నం తదితరులు పాల్గొన్నారు.


Similar News