గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్

జూన్ 9న నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు

Update: 2024-05-22 11:21 GMT

దిశ,పెద్దపల్లి : జూన్ 9న నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి జూన్ 9న ఉదయం 10-30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే అంచనా వేసి వాటిని పరిష్కరించాలని, జిల్లాలో జూన్ 9న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పకడ్బందీ నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 6098 మంది అభ్యర్థుల కోసం 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, పరీక్షా కేంద్రాల్లో సంబంధిత అభ్యర్థులకు సరిపడా అవసరమైన మేర వసతులు కల్పించాలని, ఫర్నిచర్, టాయిలెట్స్, త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చూడాలని తెలిపారు. గ్రూప్-1 పరీక్ష ప్రశ్న పత్రాలు రెండు సెట్లు పరీక్షకు 2 రోజుల ముందు జిల్లాకు వస్తాయని, వాటిని వేర్వేరుగా పోలీస్ స్టేషన్ లోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని, పరీక్ష నాడు ఉదయం ప్రశ్నాపత్రం సెట్ నిర్ణయించడం జరుగుతుందని, అప్పుడు రూట్ అధికారులు పోలీసులు బందోబస్తుతో ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

పరీక్షా కేంద్రం ప్రాంగణంలో, అదే విధంగా భవనం వద్ద ప్రతి 100 మంది అభ్యర్థులకు ఒక్కరు చొప్పున ఐడెంటిటీ అధికారులను నియమించాలని, ప్రతి అభ్యర్థిని పూర్తి స్థాయిలో చెక్ చేయాలని, మహిళలను పరిశీలించేందుకు మహిళా సిబ్బంది, ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. హాల్ టికెట్ పై ఫోటో సరిగ్గా లేకపోతే గెజిటెడ్ అధికారి లేదా అభ్యర్థి పూర్వపు విద్యాసంస్థలు ధ్రువీకరించిన లేటెస్ట్ ఫోటో అతికించి, 3 పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రం ప్రాంగణంలోకి సెల్ ఫోన్ అనుమతి ఉండదని, అభ్యర్థులు ఎవరు సెల్ ఫోన్ తీసుకుని రావడానికి వీల్లేదని, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి సైతం సెల్ ఫోన్ అనుమతి ఉండదని, ప్రతి పరీక్షా కేంద్రం ప్రాంగణంలో సెల్ ఫోన్ డిపాజిట్ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి, పరీక్ష నిర్వహణ సిబ్బంది, అభ్యర్థుల ఫోన్ లు భద్రపరచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ఒక రోజు ముందుగా వెళ్లి పరీక్షా కేంద్రాన్ని ధృవీకరించుకోవాలని, బయోమెట్రిక్ హాజరు నమోదు దృష్ట్యా 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని, అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు తో పాటు గుర్తింపు కార్డు, బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్ తీసుకొని రావాలని తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని చీఫ్ సూపరింటెండెంట్ అధికారి పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని, ప్రతి హాల్, ప్రాంగణం పూర్తిగా తనిఖీ చేయాలని తెలిపారు.

పరీక్ష నిర్వహణ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జూన్ 8న ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్, ఇన్విజిలేటర్ లు, సెక్యూరిటీ సిబ్బంది, ఐడెంటిటీ అధికారులు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించాలని అన్నారు. ప్రతి పరీక్షా హాల్ లో సీటింగ్ అరేంజ్మెంట్ కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రశ్నపత్రాల తరలింపు పోలీసుల పర్యవేక్షణలో జరగాలని, ప్రతి అంశం సీసీ కెమెరాలో రికార్డు అయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు హనుమానాయక్, బి.గంగయ్య, ఏసీపీ క్రిష్ణ, డీఈ.ఓ. - డి.మాధవి, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, చీఫ్ సూపరింటెండెంట్ లు, మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News