అంధుడైనా.. ఆశయ సాధనలో ఘనుడు!

by  |
అంధుడైనా.. ఆశయ సాధనలో ఘనుడు!
X

దిశ, ఫీచర్స్ : ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లే.. ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే’నని తన జీవితంలో ఎన్నో పాత్రలు పోషించిన దివంగత హాస్య నటుడు ఎం.ఎస్ నారాయణ చెప్తుండేవారు. ఆయన వ్యాఖ్యలు యువతకు ఆదర్శం కాగా, ఎందరో యువతీ యువకులు తమ ఆశయ సాధనకు ప్రయత్నిస్తున్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే నేపాల్‌కు చెందిన అమిత్ కేసీ. తన కల సాకారం చేసుకోవడం కోసం కృషి చేస్తున్న సదరు వ్యక్తి గురించి తెలుసుకుందాం.

పుట్టుకతో అంధుడైన అమిత్‌కు పర్వతాల అధిరోహణ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని అనున్నాడు. అయితే వైకల్యం గల వ్యక్తులు పర్వతాలు అధిరోహించేందుకు అర్హులు కాదన్న నేపాల్ ప్రభుత్వ నిర్ణయం అందుకు అడ్డుగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని నేపాల్ సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అంధుడైన 35 ఏళ్ల అమిత్ తన ఆశయ సాధనకు పూనుకున్నాడు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన జాతీయ గీతం ఆలపించాలనే కలను నెరవేర్చుకునేందుకు సాధన మొదలెట్టాడు. తన విజయంతో వైకల్యం ఉన్న వ్యక్తుల్లో స్ఫూర్తి నింపాలని భావించి.. కాళ్లు, చేతుల ఆధారంగానే పర్వతారోహణకు గైడ్‌ సూచనలతో సాధన చేస్తున్నాడు. కళ్లు కనిపించని వ్యక్తి ఈ ఫీట్ చేయడం అంత సులభం కాదని తనకు తెలుసని, అయినా ధైర్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పుకొచ్చాడు అమిత్.

ఈ క్రమంలోనే 2017లో ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రయత్నించి విఫలయ్యాడు. 8,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాక ఆక్సిజన్ అందకపోవడంతో అక్కడ్నుంచి వెనక్కు వచ్చేశాడు. అయితే తాను ఎప్పటికైనా ఎవరెస్ట్‌ను అధిరోహిస్తానని పేర్కొంటున్నాడు. ఆర్థిక సమస్యలకు తోడు అంధుడు కూడా అయిన అమిత్.. ఆత్మస్థైర్యంతో తన కల సాకారం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నం నిజంగా యువతకు ఆదర్శం.


Next Story