ట్రంప్ రాక.. మురికివాడల మూసివేత!

by  |
ట్రంప్ రాక.. మురికివాడల మూసివేత!
X

అభివృద్ధిని చూపించలేకపోయినప్పుడు కనీసం.. వెనుకబడిన విషయాలను బయటపడకుండా కాపాడుకోవడమే మంచిదని మన పాలకులు భావించారేమో..! భారీ విగ్రహాలు, స్టేడియంలు, రోడ్లు చూపించొచ్చు కానీ, పేదరికాన్ని ఎలా చూపించడం? అందుకే విదేశీ నేతలకు.. అందునా.. సతీసమేతంగా విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పేదరికం, బస్తీలు కనపడకుండా చేసే పాట్లు బయటికొస్తున్నాయి.

ఈ నెల 24, 25వ తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు. 24వ తేదీన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పాదం మోపగానే ఎయిర్ పోర్టు నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు మన ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్‌ల రోడ్ షో ఉండనుంది. దీంతో రోడ్ షో ఉన్న దారిలో సుందరీకరణ పనులను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) శ్రద్ధగా చేపడుతున్నది. కానీ, ఈ దారి మధ్యలో ఓ చోట దాదాపు 600 మీటర్ల మేరకు మురికివాడలున్నాయి. ముస్తాబవుతున్న రోడ్ల సౌందర్యాన్ని.. ఆ మురికివాడలు చెడగొడుతున్నట్టు అనిపించాయో ఏమో.. ఆ బస్తీలు కనిపించకుండా సుమారు 600 మీటర్ల దూరం వరకు ఏడు ఫీట్ల ఎత్తుతో గోడలు కట్టేశారు. ఈ గోడల ముందు త్వరలో పెరిగిన చెట్లనూ తెచ్చిపెట్టనున్నట్టు సమాచారం.

అభివృద్ధికే మాడల్‌గా చూపించిన గుజరాత్‌లో ఈ ‘తరహా’ సుందరీకరణ పనులు ఇదే మొదటిసారేమీ కాదు. 2012లో వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్, ద్వైపాక్షిక సమావేశాల కోసం జపాన్ ప్రధాని షింజో అబే సతీసమేతంగా పర్యటించినప్పుడూ జరిగాయి.


Next Story