కొవిడ్ పేషెంట్ల హత్యకు కుట్ర.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by  |
కొవిడ్ పేషెంట్ల హత్యకు కుట్ర.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా మహమ్మారితో ప్రజలు అల్లాడుతుంటే శవాల మీద చిల్లర ఏరుకునే దుర్మార్గులు పెరుగుతున్నారు. గిరాకీ లేదని ఏకంగా ఐసీయూలోని కరోనా రోగులను చంపేందుకు కూడా వెనకాడలేదు. కరోనా రోగులకు సీరియస్‌ అయినా.. చనిపోయినా తమకు కిరాయి వస్తుందని అంబులెన్స్ డ్రైవర్లు అత్యంత కిరాతక చర్యకు పూనుకున్నారు. ఆక్సిజన్ సప్లై ఆపేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఆస్పత్రి వార్డుబాయ్ ఆ దారుణాన్ని చూడడంతో రోగుల ప్రాణాలు నిలిచాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సంబంధిత డ్రైవర్లు మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ ఘోరం వెలుగుచూసింది. తమకు కొద్దిరోజులుగా పేషెంట్లు దొరకడం లేదని.. గిరాకీ పెంచుకునేందుకు ముగ్గురు అంబులెన్స్ డ్రైవర్లు దారుణానికి ఒడిగట్టారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఆక్సిజన్‌ సరఫరాని ఆపేశారు. ఆక్సిజన్ సప్లై ఆగిపోవడాన్ని గమనించిన వార్డు బాయ్ వెంటనే అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆక్సిజన్ సప్లై ఆపేసిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌ను గుర్తించి ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్పెషల్ ప్రోటెక్షన్ పోర్సు ఆధినంలో, స్థానిక పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ దండిగా ఉన్న జిల్లా ఆసుపత్రిలో ఈ దారుణం జరగడం ఆసుపత్రిలో భద్రతా లోపాలను ఎత్తి చూపుతుంది.

ఐసీయూ కొవిడ్ వార్డులోకి కనీసం పేషెంట్ అటేండర్‌ను కుడా అనుమతించని సిబ్బంది.. ప్రైవేట్ వ్యక్తులు ఏ విధంగా ప్రవేశించారు అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. జిల్లా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్‌లో సహాయం చేసేది అంబులెన్స్‎ డ్రైవర్లు, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లు అనేది అందరికీ తెలిసిందే. దీంతో ఆక్సిజన్ నిలిపివేసిన వ్యవహారం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ సంఘటనలపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

సోమవారం ఉదయం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అనుమానాస్పదస్థితిలో తిరుగుతున్నా ఒక వ్యక్తిని ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అతని సెల్‌ఫోన్‌లో అనుమతి లేకుండా తీసిన పేషెంట్స్ ఫోటోలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు పేషెంట్లకి ఆక్సిజన్ సరఫరా నిలిపివేయడం జరగలేదు. తదుపరి విచారణ కోసం ఆ వ్యక్తిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్పడం జరిగింది. -ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్

Next Story