సిద్దిపేట మత్య్సశాఖలో అవినీతి తిమింగలాలు.. ఆందోళనలో మత్య్సకారులు..

by  |
సిద్దిపేట మత్య్సశాఖలో అవినీతి తిమింగలాలు.. ఆందోళనలో మత్య్సకారులు..
X

దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట మత్స్యశాఖ అవినీతి ఊబిలో కూరుకుపోతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆ శాఖలో పనిచేసే ఉన్నతాధికారి లంచావతారం ఎత్తినట్టు ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను ప్రతి సంవత్సరం చెరువులు, కుంటల్లో వదులుతున్నారు. ఇందుకోసం ఏటా టెండర్లు పిలుస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఇక్కడే అసలు సమస్య మొదలైంది. టెండర్ల దాఖలు అంశం, చెరువుల్లో చేప పిల్లల పంపిణీ లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల దాఖలు జాప్యం కారణంగా ఈ ఏడాది ఇప్పటికి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పూర్తి కాలేదు. దీనిపై మత్స్యకార్మికులు, సీడ్ కంపెనీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి కాని చేప పిల్లల పంపిణీ ..

సిద్దిపేట జిల్లాలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లాలో 279 మత్స్య సంఘాలు ఉన్నాయి. వీరి కోసం 24 మండలాల్లోని 1,646 ట్యాంకులు ( చెరువులు ), రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ తో పాటు పలు కుంటల్లో కలిపి 3.50 కోట్ల చేప పిల్లలను వదలడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ నెలాఖరులో ప్రారంభం కావాల్సిన చేప పిల్లల పంపిణీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 8 వ తేదీన ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, హరీశ్ రావులు రంగనాయక సాగర్ లో చేపపిల్లలు వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభించి దాదాపు రెండు నెలలు పూర్తయినా, చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మాత్రం పూర్తి కాలేదు. ఇంకా ముప్పైశాతం చెరువుల్లో చేప పిల్లలు వదలలేదు. కాలం దాటాక చేప పిల్లలు వదిలితే ఆదాయం కోల్పోతామని, దీనికి సంబంధించి వెంటనే చేప పిల్లలు చెరువుల్లో వదలాలని మత్స్య కార్మికులు కోరుతున్నారు.

టెండర్ దారునితో అధికారి సిండికేట్ ..!

ప్రతి సంవత్సరం పలు కంపెనీల నుండి వలలు, క్రేట్లు, వాహనాలు, చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లు పిలుస్తారు. వీటి కోసం ఆరుగురు వ్యక్తుల ద్వారా ఫీడ్ సీడింగ్ తీసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో జిల్లా అధికారి చేతులు చాపుతున్నట్టు సమాచారం. ఉదాహరణకు ఒక్క చెరువులో లక్ష చేప పిల్లలు వదలాల్సి ఉండగా కేవలం ఇరవై, ముప్పై వేల చేప పిల్లలు వదులుతూ మిగతా చేప పిల్ల ల డబ్బులు నొక్కేస్తున్నారు. టెండర్ దారునితో కుమ్మక్కైన అధికారి ఈ ఒరవడి కి శ్రీకారం చుట్టారు. రికార్డుల్లో మాత్రం ఆ చెరువులో లక్ష చేప పిల్లలు వదిలినట్టు చూపిస్తారు. అదే విధంగా మత్స్యకారులకు వలలు, చెరువుల్లో ఉన్న చేపలకి దాణా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ తప్పుడు లెక్కలు చూపిస్తూ పైసలు దండుకుంటున్నారు. ఫలితంగా మత్స్య కార్మికులు నష్ట పోతున్నారు. పారదర్శకంగా సాగాల్సిన మత్స్యశాఖ సీఎం స్వంత జిల్లాలో పక్కదారి పట్టడంపై స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత జిల్లా అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మత్స్యకార్మికులు డిమాండ్ చేస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న వారు సైతం అన్ని రకాల చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులతో కుమ్మక్కైన టెండర్ దారులు కేవలం తక్కువ ధరకు లభ్యమయ్యే చేపలను అందిస్తున్నారు. కొర్రమీన లాంటి చేపలను అందించాలని ప్రతిపక్ష ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారి మధుసూదన్ ను వివరణ కోరగా మత్స్యశాఖలో అవినీతికి అస్కారం లేదు. పూర్తి పారదర్శకంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.


Next Story

Most Viewed