ఎమ్మెల్సీ ఎన్నికలు: మరికొద్ది గంటల్లోనే పోలింగ్

by  |
ఎమ్మెల్సీ ఎన్నికలు: మరికొద్ది గంటల్లోనే పోలింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల మండలి స్థానాలకు మరికొద్ది గంటల్లోనే పోలింగ్​ మొదలుకానుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరుగుతోంది. హైదరాబాద్‌- మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి సెగ్మెంట్​లో 93 మంది, వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల స్థానంలో 71 మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. అభ్యర్థులందరి పేర్లతో పాటు, నోటా కూడా కలిపి ఎన్నికల్లో జంబో బ్యాలెట్‌ను వినియోగిస్తున్నారు. న్యూస్‌ పేపర్‌ పరిమాణంలో బ్యాలెట్‌ పేపర్‌ ఉంది. ప్రాధాన్యతాక్రమంలో అభ్యర్థులందరికీ ఓటువేసే అవకాశం ఉండటంతో ఓటింగ్‌పై ముందుగానే అవగాహన కలిగి ఉండటం అవసరం. లేదంటే ఓటు వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది.

హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ సెగ్మెంట్​లో మొత్తం 9 జిల్లాల పరిధిలో 5,31,268 మంది ఓటర్లుండగా, 799 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్​–ఖమ్మం–నల్గొండ సెగ్మెంట్​లో 12 జిల్లాల్లో 5,05,565 మంది ఓటర్లుండగా 731 పోలింగ్​ కేంద్రాలున్నాయి. పోలింగ్​ కేంద్రాలన్నింటా వెబ్​కాస్టింగ్​ ఏర్పాటు చేశారు.

ఓటింగ్‌ విధానమిది..

* బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థులందరి పేర్లు తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంటాయి. పేరుకు ఎదురుగా ఉండే బాక్సులో అభ్యర్థికి ఇచ్చే ప్రాధాన్యతా సంఖ్యను వేయాల్సి ఉంటుంది. ప్రాధాన్యత సంఖ్యను అంకెల్లో (1, 2, 3, 4) మాత్రమే రాయాలి.

* పోలింగ్‌ కేంద్రంలో అధికారి ఇచ్చే పర్పుల్‌ కలర్‌ స్కెచ్‌ పెన్‌తో మాత్రమే అంకెలు వేయాలి. ఈ స్కెచ్​ పెన్ను కాకుండా ఏది వాడినా ఓటు చెల్లదు.

* మొదటి ప్రాధాన్యత ఓటును కచ్చితంగా వేయాలి. తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య వరకు ప్రాధాన్యతాక్రమంలో సూచించవచ్చు.

* ప్రాధాన్యతను సూచించే క్రమంలో మధ్యలో ఒక అంకెను వేయకుండా తర్వాత సూచించే ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకోరు. ఉదాహరణకు 1, 2, 3, 4, 6, 7, 8 ఇలా వస్తే మధ్యలో ‘5’ మిస్‌ అయినందున 4 వరకే పరిగణనలోకి తీసుకుంటారు.

* ఒక అభ్యర్థికి ఒక్క ప్రాధాన్యత ఓటును మాత్రమే ఇవ్వాలి. ఒకరి కంటే ఎక్కువమందికి ’1’ అని ఇస్తే ఓటు చెల్లదు. ఒక అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యత అంకెలు ఇచ్చినా చెల్లదు.

* అభ్యర్థి ఎదురుగా ఉన్న బాక్సులో రైట్‌ మార్కుగానీ, ఇతర రాతలు, సంతకాలు, వేలుముద్ర కానీ వేస్తే చెల్లదు.

* ఓటు వేయదలచుకున్న వారి పేరు పక్కన ఉన్న గడిలో 1 అంకె వేయాలి. టిక్‌ చేయకూడదు. అలాగే ఇతరత్రా మరే పద్ధతిలోనూ ఓటును మార్క్‌ చేసినా అది చెల్లదు. అంకె (నెంబర్‌) మాత్రమే వేయాలి. అక్షరాల్లో రాసినా ఓటు చెల్లదు.

* ఒక్కరికే తొలి ప్రాధాన్యత ఓటు వేసి ఆపేయవచ్చు లేదా తాము ఎన్ని అనుకుంటే అన్ని పాధాన్యత ఓట్లు వేసి (ఉదాహరణకు 10 వరకు మాత్రమే వేసి) ఆపేయవచ్చు. అయితే ప్రాధ్యానతను ఇచ్చే క్రమంలో వరుస తప్పకూడదు. ఒకే నంబరును ఇద్దరు అభ్యర్థులకు ఇచ్చినా ఓటు చెల్లకుండా పోతుంది.

9 గుర్తింపు కార్డులకు అనుమతి..

ఆదివారం జరిగే ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా తొమ్మిది రకాల గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటువేసే అవకాశమున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్లు వేయడానికి ముందు పోలింగ్‌ కేంద్రంలో వారి గుర్తింపు నిర్ధారించడం కోసం ఓటరు గుర్తింపు కార్డు కానీ లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన మరే గుర్తింపుకార్డునైనా చూపాలి. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫొటోతో కూడిన సర్వీస్‌ ఐడెంటిటీ కార్డ్‌, పాన్‌కార్డు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డు, యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీ/డిప్లొమా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, దివ్యాంగులకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డులో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి.


Next Story

Most Viewed