దేశంలో థర్డ్ వేవ్ రావొచ్చు- ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా

by  |
దేశంలో థర్డ్ వేవ్ రావొచ్చు- ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం పొంచి ఉన్నదని ఎయిమ్స్ చీఫ్, నేషనల్ టాస్క్‌ఫోర్స్(కొవిడ్-19) సభ్యుడు డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. వైరస్ మరింత ఎవాల్వ్ అవుతూ రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని సమకూర్చుకుంటే ముప్పు తప్పదని హెచ్చరించారు. కేసులు భారీగా పెరుగుతున్న వైనాన్ని కేవలం ప్రజల నిర్లక్ష్యమేనన్న కారణానికి పరిమితం చేయవద్దనీ, తొలి వేవ్‌లోని కరోనా కంటే నేడు వేగంగా వ్యాప్తి చెందే డబుల్ మ్యూటెంట్ వైరస్ ఉన్నదని తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చుకోవాలంటే వెంటనే మూడు అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరమున్నదని అన్నారు. “తొలిగా హాస్పిటళ్ల మౌలిక వసతులను మెరుగుపరుచుకోవాలి. రెండు, పెరుగుతున్న కొత్త కేసులకు కళ్లెం వేయాలి. వైరస్ ట్రాన్స్‌మిషన్ చైన్‌ను బ్రేక్ చేయాలి. అందుకోసం ప్రజలు ఒకరినొకరు కలుసుకునే అవకాశాలను చాలా వరకు కుదించాలి. మూడోది, వ్యాక్సిన్‌ల పంపిణీ వీలైనంత వేగంగా చేపట్టాలి” అని సూచనలు చేశారు.

కరోనా కేసులను తగ్గించడంపై దృష్టిపెట్టకుండా ఆస్పత్రుల్లో సదుపాయాలను పెంచుకుంటూ పోవడమూ సమస్యను పరిష్కరించదని, ముందుగా కొత్త కేసుల కట్టడికి ఉపక్రమించాలని గులేరియా వివరించారు. వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూల ప్రభావం అంతంతేనని అభిప్రాయపడ్డారు. సరిపడా కాలం వరకు కఠిన లాక్‌డౌన్ అమలు చేయడం కేసుల తగ్గింపునకు ప్రధాన అస్త్రమని తెలిపారు. “రెండు విషయాలపై మనం తక్షణమే ఒక అవగాహనకు రావాలి. ఒకటి, వైరస్‌ను నిలువరించడానికి ఏ విధానంలో మనం వేగంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేయగలం? రెండోది, వైరస్ ఏ కొత్త రూపాలను సంతరించుకునే అవకాశముంది? వైరస్ ఇలాగే పరివర్తనం చెందుతూ వైరస్ ద్వారా పొందిన ఇమ్యూనిటీ నుంచి తప్పించుకునే శక్తిని సమకూర్చుకుంటే థర్డ్ వేవ్ రావడం తథ్యం. మనం మరో వేవ్‌ను చూడవచ్చు. ఈ సారికి మనం వ్యాక్సినేషన్ చేపడుతున్నాం కాబట్టి థర్డ్ వేవ్ ఇప్పటంత భయానకంగా ఉండకపోవచ్చు. దాన్ని ఈజీగా మేనేజ్ చేయవచ్చని భావిస్తున్నా” అని అన్నారు.

మనదేశంలోని డబుల్ మ్యూటెంట్‌పై స్పందిస్తూ “గతేడాది వైరస్ కంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం గలది. గతేడాదితో పోల్చితే కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇందుకు మనం కేవలం ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారనే భావించాల్సిన పనిలేదు. వైరస్‌లోనే ఓ మేరకు ఈ మార్పు సంభవించి ఉండవచ్చు” అని తెలిపారు.


Next Story

Most Viewed