- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగారెడ్డి జిల్లా రైతాంగానికి తీపికబురు.. జీఐ ట్యాగ్ దిశగా ‘సజ్జాపూర్ చామదుంప’
సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ చామదుంపకు భౌగోళిక గుర్తింపు (GI Tag) లభించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాకు చెందిన విశిష్టమైన సజ్జాపూర్ చామదుంప (Sajjapur Colocasia) భౌగోళిక గుర్తింపు (Geographical Indication - GI Tag) పొందే దిశగా మరో కీలక మైలురాయిని చేరుకుంది. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయంలో ఈ ఉత్పత్తికి సంబంధించిన దరఖాస్తును నిపుణుల కమిటీ పరిశీలించింది. సజ్జాపూర్ ప్రాంతంలో పండే ఈ చామదుంపలు వాటి ప్రత్యేకమైన రుచి, నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి. ఇవి మార్కెట్‌లో లభించే సాధారణ చామదుంపల కంటే భిన్నంగా ఉండటమే కాకుండా, త్వరగా ఉడికే గుణాన్ని కలిగి ఉంటాయి. ఒకవేళ ఈ పంటకు జీఐ ట్యాగ్ లభిస్తే, సంగారెడ్డి ప్రాంత రైతులకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ లభించనుంది. దీంతో ఎగుమతులు పెరగడమే కాకుండా.. రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఉద్యానవన శాఖ ఈ చామదుంపకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తోంది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే అధికారికంగా జీఐ గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే తాండూరు కందిపప్పు వంటి ఉత్పత్తులు జీఐ జాబితాలో ఉండగా, ఇప్పుడు సజ్జాపూర్ చామదుంప కూడా ఆ గౌరవాన్ని దక్కించుకోనుంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ చామదుంపలకు భౌగోళిక గుర్తింపు లభిస్తే, తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల ఖ్యాతి ప్రపంచవ్యాప్తం కానుంది.






