వారి సేవలకు విశ్రాంతే లేదు!

by  |
వారి సేవలకు విశ్రాంతే లేదు!
X

దిశ, న్యూస్ బ్యూరో:
మీరు త్వరలో రిటైర్ కాబోతున్నారా? ఉద్యోగం చేసే ఓపిక ఉందా? మీకు కాస్త పలుకుబడి ఉంటే కొనసాగవచ్చు. పాలక పెద్దలను ప్రసన్నం చేసుకోవాలి. లేదంటే ఉద్యోగ సంఘాల్లో మీకు దగ్గరి బంధువులైనా ఉండాలి. మీ కోసం కొత్త పోస్టులు సృష్టిస్తారు. లేదా ఓఎస్డీలుగానైనా చెలామణి కావచ్చు. ప్రత్యేకాధికారిగా పెత్తనం చెలాయించొచ్చు. ఉద్యోగ సంఘాలు ప్రశ్నించవు. నిరుద్యోగ సంఘాలకు ఇది తెలిసేలోగా జరగాల్సింది జరిగిపోతుంది. ఎవరైనా గొంతెత్తితే పీక నొక్కడం ఖాయం. లక్షలాది మంది నిరుద్యోగులు చిరుద్యోగమైనా రాకపోతుందా అని ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ ‘పలుకుబడి’ కొనసాగింపులతో వారికి ఫలితం లభించడం లేదు. 30 ఏళ్లుగా వివిధ హోదాల్లో పని చేసిన పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఉద్యోగ విరమణ అనంతరం ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ఈ తంతు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. సచివాలయంలోనూ, మంత్రుల పేషీల్లోనూ పని చేస్తున్నారు. కార్పొరేషన్లలోనూ దర్శనమిస్తున్నారు. ఇలా 10 మంది కాదు, 20 మంది కాదు.. ఏకంగా రెండు వేల మంది అ‘విశ్రాంతంగా’ పని చేస్తున్నారు.

వల్లమాలిన ప్రేమ..

‘నీళ్లు.. నిధులు.. నియామకాల’ నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో నియామకాలపై తొలి నుంచీ గందరగోళమే నెలకొంది. నిరుద్యోగ యువతకు ఎలాంటి భరోసా కలగడం లేదు. లక్ష ఉద్యోగాలు భర్తీ అయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. యువతలో మాత్రం నిరాశా నిస్పృహలు కొనసాగుతున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగాలలో కొన‘సాగుతున్న’వారు ఇంకా భాగ్యవంతులవుతున్నారు. కీలక ప్రాజెక్టుల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వారు మినహా మరెవరూ ఆ ప్రాజెక్టులను అమలు చేయలేరన్న అభిప్రాయాన్ని పాలకులకు కల్పించారు. టెస్కోలో రూ.300 కోట్లకు పైగా వెచ్చించి చేపట్టిన బతుకమ్మ చీరల ప్రాజెక్టు అమలు బాధ్యతను ఓ రిటైర్డ్ అధికారి మాత్రమే నిర్వర్తించగలడని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మంత్రి కేటీఆర్ సైతం సదరు అధికారి పట్ల ఆదరాభిమానాలను కురిపిస్తున్నారు. ఇదే పరిస్థితి హెచ్ఎండీఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ వంటి పెద్ద సంస్థల్లోనూ ఉంది. చాలా మంది ఓఎస్డీలుగా కొనసాగుతున్నారు. మంత్రుల పేషీల్లోనూ తిష్ఠ వేశారు. సీనియార్టీ పేరుతో ఆయా శాఖల ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రాజెక్టులు, పథకాలు వీరి ఆధిపత్యంలోనే నడుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ సీనియర్ ఐఏఎస్ కు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు లభించినా, ఆయన కంటే రిటైర్డు సీనియర్ అధికారి పెత్తనం, మాటే చెల్లుబాటయ్యిందని ఐఏఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు.

ఒకకరికైతే నాలుగేండ్లు

హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్సు డిపార్టుమెంటులో ఈఎన్సీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేసిన ఎం.సత్యనారాయణరెడ్డి 2016 జూలైలోనే రిటైరయ్యారు. ఆయన విధులను జీఓ నం.536, తేదీ.30.7.2016 ద్వారా రెండేండ్లు పొడిగించారు. జీఓ నం.617, తేదీ.31.7.2018 ద్వారా మరో రెండేండ్లు పొడిగించారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా నాలుగేండ్లు కీలక స్థానంలోనే పని చేశారు. ఈ నెలలో గడువు ముగిసిపోతుంది. ఇంకో రెండేళ్ల పొడిగింపునకు చకచకా పావులు కదులుతున్నాయని బోర్డులో ప్రచారం సాగుతోంది. నీటి పారుదల శాఖలో ఇంజినీర్ ఇన్ చీఫ్ గా పని చేసిన మురళీధర్ రావు, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ గా పని చేసిన గణపతిరెడ్డి, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఆర్ అండ్ బీలో రవీందరెడ్డి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్​ సత్యనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శిగా శివశంకర్, ఆర్ధిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా రామ్మోహన్ రావు, గజ్వేల్ ఏరియా డెవలప్ అథారిటీ స్పెషల్ అధికారిగా ముత్యంరెడ్డి, అసెంబ్లీ సెక్రటరీగా నర్సింహాచార్యులు.. ఇలా అనేక మంది అధికారులు ‘ఎక్స్ టెన్షన్’ లో ఉన్నారు. అధికార హోదాను అనుభవించిన వారు, పెన్షన్ సదుపాయాన్ని సంపాదించుకున్న వారు పదవులను పట్టుకొని వేలాడుతున్నారు. చీఫ్ సెక్రటరీగా పని చేసిన రాజీవ్ శర్మ మొదలుకొని రాంలక్ష్మణ్, కేవీ రమణాచారి, రామచంద్రుడు, ఎస్ కే సిన్హా, ఏకే గోయల్, జీఆర్ రెడ్డి.. ఇలా అనేక మంది ఐఏఎస్ లు. ఐపీఎస్ లుగా పని చేసిన అనురాగ్ శర్మ, ఇంకొందరు కొత్త పదవుల్లో కొలువుదీరారు.

తప్పని ఎదురు చూపులు..

ఎంతో మంది అధికారులు, ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి ప్రిపేరవుతూనే ఉన్నారు. వారి అవకాశాలను ఈ రిటైర్డు పెద్దలు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారు పోస్టుల్లో కొనసాగుతుండడంతో వాటిని ఖాళీల జాబితాలో పేర్కొనడం లేదు. ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేయాల్సిన కొన్ని సంఘాల పెద్దలు వారి బంధుగణానికే పని చేస్తున్నారు. ఇటీవల టీజీఓ అధ్యక్షురాలు మమత భర్త, ప్రభుత్వ కెమిస్ట్రీ లెదర్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ లో సీనియర్ లెక్చరర్ గా ఉన్న వెంకటేశ్వర్ రావు సర్వీసును రెండేండ్లపాటు పొడిగించారు. మరో నాయకుడు రాజేందర్ బావ సర్వీసునూ రెండేండ్లు పొడిగించారు. పోరాడాల్సిన సంఘాల నాయకులు మాత్రం వారి బంధుగణానికి మేలు కలిగించే ఉత్తర్వుల కోసం వెంపర్లాడుతున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు.

లెక్కలేనన్ని పోస్టింగులు..

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగులు ఎందరు ఇంకా విధుల్లో కొనసాగుతున్నారన్న అంశంపై ఆర్ధిక శాఖ దగ్గర కూడా స్పష్టమైన సమాచారం లేదు. ఏ యే శాఖలో ఎవరెవరు కొనసాగుతున్నారో, ఎవరు హోదాలో పని చేస్తున్నారో, ఎవరికెంత వేతనం ముట్టజెబుతున్నారో అంతుచిక్కడం లేదు. ఒక్కో శాఖలో ఒక్కో విధంగా చెల్లింపుల ప్రక్రియ, నియామకం సాగుతోంది. కార్పొరేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. అదే అదనుగా భావించిన పాలకులు, ఐఏఎస్ లు వారి అనూయులకు ఉద్యోగాలను, పదవులను కట్టబెడుతున్నారు. కేవలం మ్యాన్ పవర్ లేకపోవడమే కారణమని ఓ అధికారి చెప్పారు. ఉద్యోగులకు పదోన్నతులు రాకుండా, నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టుకుంటూ వీరెంత కాలం పని చేస్తారోనన్న విమర్శలు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed