అఫ్ఘానీ మహిళల గొంతు వినిపిస్తున్న ‘కుడ్య చిత్రాలు’

by  |
అఫ్ఘానీ మహిళల గొంతు వినిపిస్తున్న ‘కుడ్య చిత్రాలు’
X

దిశ, ఫీచర్స్ : తాలిబన్ల పాలనలో అఫ్ఘానిస్తాన్‌లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రోజూ చూస్తూనే ఉన్నాం. అక్కడేకాదు పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు ఎదుర్కొంటున్న అవమానాలెన్నో. ఈ నేపథ్యంలో అఫ్ఘానీ మొట్టమొదటి మహిళా గ్రాఫిటీ ఆర్టిస్ట్ హమ్సియా హస్సానీ.. తన స్ట్రీట్ ఆర్ట్ ద్వారా అతివల్లో స్ఫూర్తినింపుతూ జీవితంపై ఓ ప్రత్యేక దృక్ఫథాన్ని ఏర్పరుస్తోంది.

ఇరాన్‌లో శరణార్థులుగా ఉన్న అఫ్ఘాన్ తల్లిదండ్రులకు 1988లో జన్మించిన హస్సానీ, 2005లో అఫ్ఘానిస్తాన్‌కు తిరిగి వచ్చి కాబూల్ యూనివర్సిటీలో పెయింటింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్ నేర్చుకుంది. 2010లో గ్రాఫిటీ, స్ట్రీట్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్న ఆమె.. కుడ్యచిత్రాలను రూపొందించడానికి అఫ్ఘాన్‌లోని యుద్ధ వీధుల్లోకి ప్రవేశించింది. పురుషాధిపత్య సమాజంలో మహిళల గొంతుకను ఆమె తన ఆర్ట్ ద్వారా వ్యక్తపరచాలనుకుంది. ఈ విధంగా మహిళలపై ఉన్న సమాజ దృక్కోణాన్ని మార్చాలనుకుంది.

ప్రజలు విడిచిపెట్టిన, ధ్వంసమైన భవనాలను.. బాంబు పేలుళ్ల వల్ల దెబ్బతిన్న గోడలను ఆమె కాన్వాస్‌గా మార్చుకుంది. తన ఆలోచనలను అందమైన, శక్తివంతమైన గ్రాఫిటీలో ప్రతిబింబిస్తూ అఫ్గాన్‌లో అలుముకున్న చీకట్ల నుంచే నగరం రంగులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించేది. మహిళల పరిస్థితిని తన పెయింటింగ్ ద్వారా ప్రపంచానికి వివరిస్తూ వారిలో దాగున్న శక్తియుక్తులను, ధైర్యాన్ని వెలికితీసింది. ఈ క్రమంలో ఆమె ప్రమాదాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రతిఘటనను కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే 2014 టాప్ 100 గ్లోబల్ థింకర్స్ జాబితాలోనూ హస్సానీ చోటు దక్కించుకుంది.

తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత.. హస్సానీ సోషల్ మీడియా ఖాతా కొన్ని రోజులు మూగపోవడంతో తన ఫాలోవర్స్ ఆందోళన చెందారు. కానీ ‘డెత్ టు డార్క్‌నెస్’ అని ఆమె పోస్ట్ చేయడంతో సేఫ్‌గా ఉందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Next Story

Most Viewed