సంపన్నుల జాబితాలో స్థానం కోల్పోయిన ఆదానీ.. ఎందుకో తెలుసా?

by  |
Adani
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంలోనే అత్యంత వేగంగా లాభాలు గడించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల పరిణామాల్లో అదానీ గ్రూప్ సంస్థలపై వచ్చిన వార్తల కారణంగా ఆయన సంపద ఒక్కసరిగా కుప్పకూలింది. తాజాగా బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్స్ సూచీ ప్రకారం.. గౌతమ్ అదానీ కేవలం నాలుగు రోజుల్లో ఏకంగా రూ. లక్ష కోట్లను కోల్పోయారు. అలాగే, జూన్ 11 నాటికి అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 9.5 లక్షల కోట్లుగా ఉండగా, శుక్రవారం నాటికి రూ. 7.90 లక్షల కోట్లకు పడిపోయింది.

దీంతో కేవలం వారం రోజుల్లో సంస్థ రూ. 1.59 లక్షల కోట్లు నష్టపోయింది. కేవలం వారంలో ఆయన సంపద రికార్డు స్థాయిలో కుప్పకూలడంతో ఆసియా రెండో అత్యంత సంపన్నుడి స్థానాన్ని కూడా కోల్పోయారు. గౌతమ్ అదానీ ప్రపంచంలోనే ఎవరూ కోల్పోనంతగా 13.2 బిలియన్ డాలర్లు నష్టపోయారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. దీంతో ఆయన సంపద 63.5 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు పేర్కోంది. గత కొన్నాళ్లుగా గౌతమ్ అదానీ ఆసియా అత్యంత సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో అగ్రస్థానానికి పోటీ పడుతున్నారు. అయితే, అనూహ్య పరిస్థితుల్లో ఆయన భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.


Next Story