ఏసీపీ అక్రమాస్తులు రూ.100 కోట్లకు పైమాటే !

by  |
ఏసీపీ అక్రమాస్తులు రూ.100 కోట్లకు పైమాటే !
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు ఒక్కొక్కటిగా విప్పుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించిన ఏసీబీ బుధవారం ఏకకాలంలో 25చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో బుధవారం నాటికే మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.70కోట్ల ఆస్తిని లెక్కించగా, ఏసీపీ నరసింహారెడ్డిని గురువారం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో విచారించారు. ఇదే సమయంలో ఉప్పల్‌లోని ఏసీపీ కార్యాలయంతో పాటు మేడిపల్లి, ఉప్పల్‌లోని నర్సింహారెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. అంతే కాకుండా, జనగామ జిల్లాలో 3చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఓ ఏఎస్ఐ, అశోక్ పాటిల్‌తో పాటు మాదాపూర్ ‌కు చెందిన ఓ మహిళ పేర్లపై భారీ ఆస్తులు కూడబెట్టినట్టుగా అధికారులు గుర్తించారు.

భూ వివాదాలు, సెటిల్మెంట్లే లక్ష్యంగా పనిచేసిన ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు రూ.100 కోట్లకు పైగానే కూడబెట్టినట్టుగా సమాచారం. అనంతపురంలో బుధవారం నాటి సోదాలో ఇప్పటికే 55ఎకరాలను గుర్తించగా గురువారం నాటి విచారణలో మరిన్ని వ్యవసాయ భూములను గుర్తించినట్టు తెలుస్తోంది. భార్య పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, అనేక ఎకరాల భూములను కొనుగోలు చేసినట్టుగా సమాచారం. అంతే కాకుండా, ఎస్బీఐ, ఆంధ్రబ్యాంకులలో లాకర్లను గుర్తించగా, ఓ లాకర్ ను ఓపెన్ చేస్తే.. 300 గ్రాముల బంగారం లభ్యమైనట్టుగా సమాచారం. అనంతరం ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు రిమాండ్ చేశారు. అయితే, ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తులపై మొదటి రోజు మీడియాకు వివరాలు తెలియజేసిన ఏసీబీ అధికారులు.. రెండో రోజు గురువారం నాటి లెక్కలను మీడియాకు తెలియజేయకపోవడం గమనార్హం.



Next Story