ముందే చెప్పిన ‘దిశ’.. సినిమాను తలపిస్తోన్న సంతోష్ మర్డర్..

by  |
ముందే చెప్పిన ‘దిశ’.. సినిమాను తలపిస్తోన్న సంతోష్ మర్డర్..
X

దిశ, జమ్మికుంట : జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన సిరిసేటి సంతోష్ అలియాస్ సంతు (40) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సంతోష్ హత్యకు గల కారణాలను పోలీసులు ఛేదించడమే కాకుండా, నేడో రేపో నిందితులను అరెస్ట్ చేయనున్నారని ‘దిశ’ఇప్పటికే వెలుగులోకి తెచ్చింది. తాజాగా కరీంనగర్ సీపీ సత్యనారాయణ గురువారం జమ్మికుంట పీఎస్‌లో నిందితుల గురించిన వివరాలను మీడియాకు వివరించారు. సంతోష్‌ను అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కుక్కల రాజ్ కుమార్ (27), పల్లవి అలియాస్ దివ్య అలియాస్ సంధ్య అలియాస్ శిరీష (25)హత్య చేశారని తెలిపారు. ఈ నెల 13 తెల్లవారు జామున వెంకటేశ్వర్లపల్లి గ్రామ శివారులో సంతోష్‌ను దారుణంగా హత్య చేసి పరారయ్యారని చెప్పారు.

నిందితుడు రాజ్‌కుమార్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్‌పాకకు చెందిన గొర్రె మౌనికతో ఆయనకు వివాహం జరగగా వీరికి ఒక బాబు కూడా ఉన్నాడని సీపీ వివరించారు. రాజ్ కుమార్ భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు విలాసాగర్‌కు చెందిన కుర్ర నాగరాజు భార్య పల్లవితో నిందితుడికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో తిరుపతిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం హన్మకొండలో కాపురం ఉన్న వీరు ఈనెల 3న హుజురాబాద్‌కు మకాం మార్చారు.

రాజ్‌కుమార్‌కు చెందిన ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులకు పట్టించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన కేసు, అదేవిధంగా ఓ యువతిని వేధింపులకు గురి చేస్తున్నాడన్న కేసు తనపై నమోదు కావడానికి సంతోష్ కారణమని నిందితుడు అనుమానించాడు. అయితే, ఇటీవల రాజ్‌కుమార్ మొదటి భార్య చిట్యాల పోలీసులను ఆశ్రయించడంతో అతన్ని పోలీసులు పిలిపించారు. అప్పుడు సంతోష్ కూడా చిట్యాలకు వెళ్లాడని సీపీ తెలిపారు. నాటి నుంచి సంతోష్ నిత్యం మాటలతో తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, ఏనాటికైనా తమ కాపురాన్ని వేరు చేస్తాడన్న భయంతో రాజ్‌కుమార్ అతని రెండో భార్య పల్లవి అతన్ని చంపాలని ప్లాన్ చేసుకున్నారని సీపీ సత్యనారాయణ చెప్పారు.

ఇందులో భాగంగా పల్లవి ఈ నెల 12న హన్మకొండలో ఓ ఆటో అద్దెకు తీసుకుని రెండు కత్తులు కొనుగోలు చేసి, మెడికల్ షాపులో నిద్ర మాత్రలతో పాటు పారాసిటమాల్ ట్యాబెట్లను కూడా కొనుగోలు చేసి.. మరో అమ్మాయిని కూడా తన వెంట తీసుకుని వెంకటేశ్వరపల్లికి చేరుకుంది. అప్పటికే రాజ్ కుమార్ 3 లీటర్ల పెట్రోల్, అగ్గిపెట్టతో ఎదురు చూస్తున్నాడు. పల్లవి తన వెంట తీసుకొచ్చిన అమ్మాయిని జూపిటర్ ద్విచక్రవాహనంపై ఎక్కించుకున్న రాజ్ కుమార్ సంతోష్ వద్ద ఆమెను దింపి వెళ్లిపోయాడన్నారు. నేరుగా బెల్టు షాపునకు వెళ్లిన నిందితుడు రాయల్ స్టాగ్ క్వార్టర్ బాటిల్, కూల్ డ్రింక్, గ్లాసులు తీసుకుని ఆటోవద్దకు వెళ్లి పల్లవిని తనతో పాటు తీసుకెళ్లాడని సీపీ వివరించారు.

వెంకటేశ్వరపల్లి శివారు సంతోష్ ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలో పల్లవి ఆగి రాయల్ స్టాగ్ లిక్కర్‌లో నిద్ర మాత్రలు, పారాసిటమాల్ ట్యాబెట్లను కలిపి రాజ్‌కుమార్‌కు అప్పగించిందని చెప్పారు. నిందితుడు నేరుగా సంతోష్ ఉన్న చోటకు చేరుకుని తనవెంట తీసుకెళ్లిన లిక్కర్ ఇచ్చి అతని వద్ద ఉన్న అమ్మాయిని బైక్ పై తీసుకుని వచ్చి ఆటోలో హన్మకొండకు పంపించినట్టు చెప్పారు. తిరిగి సంతోష్ వద్దకు చేరుకోగా అతను మత్తులోకి జారుకున్న విషయాన్ని గమనించి రెండో భార్య పల్లవికి ఫోన్ చేసి కత్తులు, పెట్రోల్ బాటిల్లు తీసుకుని రమ్మని చెప్పడంతో ఆమె అక్కడకు చేరుకుంది. అనంతరం బండరాయితో సంతోష్ తలపై కొట్టి, కొంతదూరం లాక్కెళ్లి మళ్లీ బండతో కొట్టి అతని శరీరంపై ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నారన్నారు.

ఆ తరువాత సంతోష్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఆ మంటల్లోనే అతని సెల్‌ఫోన్లు, చెప్పులు కూడా వేశారన్నారు. అక్కడి నుంచి హుజురాబాద్ లో వారు నివాసం ఉంటున్న ఇంటికి చేరుకుని హత్యకు ఉపయోగించిన కత్తులు, దుస్తులు రూంలో దాచిపెట్టి వేములవాడ, కొండగట్టు, నిజామాబాద్ వరకు జూపిటర్ బైక్ పై వెళ్లారన్నారు. బైక్‌ను నిజామాబాద్ బస్‌స్టేషన్‌లో పార్క్ చేసి గోవా, కర్ణాటక, ఏపీలోని ఒంగోలు, తిరుపతి, శ్రీకాళహస్తీలలో తిరిగారని సీపీ సత్యనారాయణ వివరించారు. డబ్బుల కోసం హుజురాబాద్ కోసం రాగా, వారిని అరెస్ట్ చేశామని వివరించారు. నిందితుల నుండి హత్య చేసిన వేసుకున్న దుస్తులు, కత్తులు, మృతుడు సంతోష్ నుండి దొంగలించిన బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించిన అడిషనల్ డీసీపీలు చంద్ర మోహన్, శ్రీనివాస్, ఏసీపీ కోట్ల వెంటకరెడ్డితో పాటు స్పెషల్ టీంలకు సీపీ రివార్డు ప్రకటించారు.



Next Story

Most Viewed