ఇంటికి మీటర్ అడిగితే.. కాసులకు కక్కుర్తి పడిన సబ్ ఇంజినీర్.. చివరగా ఏసీబీ వలకు చిక్కి!

113

దిశ, పాలేరు : విద్యుత్ మీటర్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడో సబ్ ఇంజినీర్. ఈ ఘటన తిరుమలాయపాలెం మండలంలో శనివారం వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే.. తిరుమలాయపాలెం మండలంలోని బచ్చొడు గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి తన ఇంటికి విద్యుత్ మీటర్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, TS NPDCL ఆధీనంలోని కూసుమంచి సబ్ డివిజన్ పరిధి బచ్చొడు సెక్షన్‌లో సబ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న గోవర్ధన్ విద్యుత్ మీటర్ మంజూరు చేయాలంటే రూ.2,000 లంచం ఇవ్వాలని రామకృష్ణను డిమాండ్ చేశాడు.

పలుమార్లు వేడుకున్న ఆ అధికారి వినిపించుకోలేదు. దీంతో విసిగిపోయిన బాధిత వ్యక్తి రామకృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే శనివారం బచ్చొడు సెక్షన్ కార్యాలయంలో సబ్ ఇంజినీర్ గోవర్ధన్ రూ. 2వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి, ఇన్సెపెక్టర్‌లు శ్రీనివాస్, రవి, సిబ్బంది పాల్గొన్నారు.