మిస్ సిమ్లా టు బిగ్‌బాస్ విన్నర్.. రుబీనా జర్నీ

by  |
మిస్ సిమ్లా టు బిగ్‌బాస్ విన్నర్.. రుబీనా జర్నీ
X

దిశ, ఫీచర్స్ : నాలుగు నెలల క్రితం అక్టోబర్ 3న అట్టహాసంగా ప్రారంభమైన హిందీ ‘బిగ్‌బాస్ సీజన్ 14’.. ఫిబ్రవరి 21న ముగిసింది. గ్రాండ్ ఫినాలే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌లో రాఖీ సావంత్, రుబీనా దిలాఖ్, రాహుల్ వైద్య, నిక్కి తంబోలి, ఎలీ గోని పోటీపడ్డారు. ముందుగా రాఖీ సావంత్.. రూ.14 లక్షలు తీసుకొని షో నుంచి నిష్క్రమించగా.. ఆ తర్వాత ఎలీ గోని, నిక్కి తంబోలి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఫైనల్‌గా రుబీనా దిలాఖ్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకోవడంతో రాహుల్ వైద్య రన్నరప్‌గా నిలిచాడు. ఇక్కడ మ‌రో విశేషం ఏంటంటే ‘బిగ్ బాస్ సీజ‌న్ 14’ విజేత రుబీనా త‌న భ‌ర్త అభిన‌వ్ శుక్లాతో క‌లిసి హౌజ్‌లోకి అడుగుపెట్టింది. ఫినాలేకు కొద్ది రోజుల ముందే అభిన‌వ్ ఎలిమినేట్ కాగా, రుబీనా మాత్రం తనదైన స్టైల్‌లో గేమ్ ఆడి, ట్రోఫీ గెలుచుకుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ హిందీ టైటిల్ గెలుచుకున్న ఆరో మహిళగా నిలిచింది.

బిగ్‌బాస్ షో.. రుబీనాకు నేమ్, ఫేమ్‌, మనీతో పాటు విడిపోయే బంధాన్ని దగ్గర చేసింది. రుబీనా, అభినవ్‌లు 2018లో ప్రేమ వివాహం చేసుకోగా.. కొంతకాలంగా తమ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విడాకుల గురించి కూడా ఆలోచించామని తామే స్వయంగా షోలో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వారిద్దరూ కలిసే ఉండాలని అనుకుంటున్నారు. 1987 ఆగస్టు 26న సిమ్లాలో జన్మించిన రుబీనా.. తన విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేసింది. ఇక 2006లో మిస్ సిమ్లా కిరీటం గెలుచుకున్న తను.. 2008లో జీ టీవీలో ప్రారంభమైన ‘చోటి బహు’ సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమె తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘సాస్ బినా ససురాల్, దేవోంకే దేవ్, మహాదేవ్, శక్తి’ సీరియల్స్‌లో తనదైన నటనతో ఫేమ్ సంపాదించుకుంది. శక్తిలో ఆమె చేసిన ట్రాన్స్‌జెండర్ పాత్ర తనకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. సీరియల్స్‌తో పాటు ‘బరేలి కే భేటి’ వంటి షార్ట్ ఫిల్మ్‌లోనూ నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది రుబీనా. అంతేకాదు మోస్ట్ ఫిట్ యాక్ట్రెస్‌గా 2017లో గోల్డ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ 14 ట్రోఫీ గెలిచిన తర్వాత, ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చేసిన రుబీనా.. తనకు మద్దతిచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపింది. ‘అందరికీ చాలా ధన్యవాదాలు. నన్ను నమ్మిన, నాపై చాలా ప్రేమను చూపించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉంది. విజేతగా నిలవాలన్న నా కల నెరవేరింది. బిగ్ బాస్ జర్నీలో నన్ను నేను కనుగొన్నాను’ అని తెలిపింది.


Next Story