సీపీఎస్ రద్దే అసలు పరీక్ష.. ఉద్యోగుల భవిష్యత్తుపై జేఏసీ దృష్టి సారించాలి!

by Ravi |   (  Updated:2026-06-07 00:45:18  IST  )

తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ ముందుంచిన డిమాండ్లలో సీపీఎస్ రద్దు అంశం ఎందుకు అత్యంత కీలకమో, యువ ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అవసరం, ప్రభుత్వ బాధ్యతలపై వ్యాసం.

సీపీఎస్ రద్దే అసలు పరీక్ష.. ఉద్యోగుల భవిష్యత్తుపై జేఏసీ దృష్టి సారించాలి!
X

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఒకే తాటిపైకి వచ్చి సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ)గా ఏర్పడడం ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ క్రమంలోనే జేఏసీ ఉద్యోగ లోకంలోని విభిన్న సమస్యలను క్రోడీకరిస్తూ ఏకంగా 64 డిమాండ్లతో ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం అత్యంత సముచితమైన పరిణామం.

ఆరంభంలో హర్షణీయంగానే అనిపించినా..

అయితే, వ్యూహాత్మక చతురతతోనో లేదా తక్షణ పరిష్కారాల కోసమో జేఏసీ ఆ 64 డిమాండ్ల నుంచి అత్యంత కీలకమైన, అత్యవ‌సరమైన నాలుగు ప్రధాన డిమాండ్లను వేరు చేసి ప్రభుత్వం ముందు ఉంచడం ఆరంభంలో హర్షణీయంగానే అనిపించింది. కొత్త పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల తక్షణ చెల్లింపు, ఉద్యోగుల ఆరోగ్య కార్డుల (ఈహెచ్ఎస్) సక్రమ నిర్వహణ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు... ఈ నాలుగింటిని తక్షణం పరిష్కరించాల్సిన అంశాలుగా గుర్తించడం జేఏసీ నాయకత్వ పరిణతికి నిదర్శనంగా నిలిచింది. కానీ, ఈ ప్రక్రియే కాలక్రమేణా సామాన్య ఉద్యోగులలో, ముఖ్యంగా యువ ఉద్యోగులలో ఒక రకమైన అసంతృ‌ప్తిని, ఆందోళనను రేకెత్తించడానికి కారణమైంది.

సీపీఎస్ రద్దుపై హామీ లేనేలేదు..

మరింత విచారకరమైన విషయం ఏమిటంటే, జేఏసీ ప్రతిపాదించిన ఆ నాలుగు ప్రధాన డిమాండ్లలో మొదటి మూడు అంశాలైన పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు చేపట్టడానికి ముందుకు వచ్చింది. దీనిని ఉద్యోగ సంఘాల పోరాట విజయంగా ఖచ్చితంగా అభినందించవచ్చు. కానీ, ఉద్యోగుల జీవితాలను శాసించే అత్యంత కీలకమైన నాలుగో డిమాండ్.. ‘సీపీఎస్ రద్దు’ (పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ) విషయంలో మాత్రం ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి గట్టి పురోగతి లేదా స్పష్టమైన హామీ లభించలేదు. సగం మంది ఉద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సీపీఎస్ సమస్యను అలాగే పెండింగ్‌లో ఉంచి ఉద్యమ తీవ్రతను తగ్గించడం వల్ల, సీపీఎస్ ఉద్యోగులకు కోలుకోలేని నష్టం వాటిల్లిందనే భావన బలంగా వినిపిస్తోంది.

తీవ్ర ఆగ్రహంతో సీపీఎస్ ఉద్యోగులు..

ఈ పరిణామంపై సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో, అల కతో ఉన్నారు. ఎందుకంటే, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో విధులను నిర్వహిస్తున్న మొత్తం ఉద్యోగులలో దాదాపు యాభై శాతానికి పైగా సీపీఎస్ పరిధిలోకి వచ్చే వారే ఉన్నారు. సచివాలయం నుండి మొదలుకొని మారుమూల గ్రామాల్లో పని చేసే ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు, క్లర్కుల వరకు అంతా యువ శక్తే వ్యవస్థను నడిపిస్తోంది. వ్యవస్థలో సగం భాగస్వామ్యం ఉన్న ఒక పెద్ద వర్గానికి సంబంధించిన ప్రాణాధారమైన డిమాండ్‌ను పరిష్కరించకుండానే ఉద్యమాన్ని తాత్కాలికంగా ముగించడం లేదా వాయిదా వేయడం పలు విమర్శలకు తావిస్తోంది.

ఉద్యోగుల అసంతృప్తి న్యాయమైందే!

నిజానికి, సీపీఎస్ ఉద్యోగుల అసంతృప్తిని ప్రభుత్వం కూడా గమనించాల్సి ఉంది. పాలనలో కీలక భూమిక పోషిస్తున్న యువ ఉద్యోగులు అభద్రతా భావంతో, నిరాశతో విధులు నిర్వహిస్తే అది దీర్ఘకాలంలో ప్రభుత్వ సామర్థ్యంపైనే ప్రభావం చూపుతుంది. దేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న తరుణంలో, ప్రగతి శీల తెలంగాణ రాష్ట్రంలో కూడా దానిపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సీపీఎస్ రద్దు అనేది కేవలం ఆర్థికపరమైన అంశం కాదు, అది శ్రమకు ఇచ్చే కనీస గౌరవం, మానవీయ కోణం.

ఇది సానుకూల హెచ్చరికే..

ఇప్పటికైనా మించిపోయింది లేదు. జేఏసీ నాయకత్వం సీపీఎస్ ఉద్యోగులలో వ్యక్తమవుతున్న అసంతృప్తిని సానుకూలమైన హెచ్చరికగా స్వీకరించాలి. తదుపరి కార్యాచరణలో సీపీఎస్ రద్దు అంశాన్ని ఏకైక ప్రథమ డిమాండ్‌గా ముందుకు తీసుకు వెళ్లాలి. ప్రభుత్వం కూడా ఈ సమస్యను కేవలం నిధుల కొరతగా చూడకుండా, యాభై శాతం మంది ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తుగా పరిగణించాలి.

-జుర్రు నారాయణ యాదవ్

తెలంగాణ టీచర్స్ యూనియన్

94940 19270

Next Story