సూటిగా సుత్తిలేకుండా..‘హిట్’ చానల్..

by  |
సూటిగా సుత్తిలేకుండా..‘హిట్’ చానల్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నెట్‌లో ఎంతో సమాచారం ఉంటుంది. కానీ, అర్థమయ్యేలా చెప్పేది కొందరే. అందరూ ఒకే సమాచారాన్ని ఇస్తారు. కానీ, అర్థమయ్యేలా చక్కగా వివరించగలిగినవారే ఇన్‌ఫ్లూయెన్సర్‌లుగా విజయం సాధించగలుగుతారు. అయితే, ఆ సమాచారంలో ఎంత తప్పు ఎంత ఒప్పు అనే విషయం మీద కూడా వారి పాపులారిటీ ఆధారపడి ఉంటుంది. అందరు ఇన్‌ఫ్లూయెన్సర్ల లక్ష్యం ఒకటే. తమ వీడియోల్లో ఇచ్చిన సమాచారం వల్ల కనీసం ఒక్కరి లైఫ్‌లో అయినా మార్పు తీసుకురావడం. అలాంటి ఉద్దేశంతోనే అభి అండ్ నియు యూట్యూబ్ చానల్ ప్రారంభమైంది. వారు లక్ష్యానికి మించి ఇతరులను ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతున్నారు.

అభిరాజ్ రాజాధ్యక్ష, నియతి మావిన్‌కుర్వే దంపతులు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదించేవారు. కానీ, సంతృప్తి లేదనిపించింది. ట్రావెలింగ్ మినహా దాదాపు అన్ని అంశాల మీద భిన్నాభిప్రాయాలు గలవారు. అయితే, నేర్చుకోవాలి, నేర్పించాలనే ఉత్సుకత ఇద్దరికీ ఉంది. అందుకే ఉద్యోగాలు మానేసి ట్రావెలింగ్ వ్లోగ్స్ ప్రారంభించారు. ఆ ప్రయాణంలో భాగంగా భారతదేశాన్ని ప్రేమించడానికి గల 100 కారణాలు అంటూ ఒక్కో పర్యాటక ప్రదేశానికి సంబంధించి ఒక్కో వీడియో పెట్టారు. కేవలం ఆయా ప్రదేశాల గురించి చెప్పడం మాత్రమే కాదు, పురాణాల్లో ఆ ప్రదేశాల ప్రత్యేకత, అక్కడి వంటలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైన మనుషులు ఇలా వీడియోలు పెట్టుకుంటూ పోయారు. ఈలోగా కరోనా లాక్‌డౌన్ వచ్చేసింది. ట్రావెలింగ్ బ్యాన్ అయింది.

మరి ఇప్పుడెలా?

వాళ్లు పెట్టిన ట్రావెలింగ్ వ్లోగ్స్‌లో వారు వివరించే విధానం, ఒక అంశం గురించి లోతుగా పరిశోధించి, ప్రజెంట్ చేసే స్టైల్ అందరికీ నచ్చింది. దాంతో లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండి తమకు ఉన్న నాలెడ్జిని అందరికీ పంచాలనుకున్నారు. అంతే..ఒక్క ట్రావెలింగ్ అని మాత్రమే కాదు జాతీయం, అంతర్జాతీయం, ఇంటర్నెట్, సోషల్ మీడియా, టెక్నాలజీ ఇలా ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా అన్ని రకాల అంశాలను తమదైన శైలిలో వివరించడం ప్రారంభించారు. ఇటు వర్తమాన వ్యవహారాలు, అటు సోషల్ మీడియా ట్రెండ్స్‌తోపాటు వివాదాస్పద అంశాలు, మూఢనమ్మకాలు ఇలా అన్ని విషయాలను తమ వీడియోల్లో అభి, నియు వివరించారు. ఇలాంటి అంశాలను ఎంచుకున్నప్పుడు ఏది తెలిస్తే అది చెప్తే కుదరదు. మాట్లాడే ప్రతి మాటకు ఆధారం ఉండాలి. లేదంటే అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తాము చెప్పే ప్రతి అంశానికి సంబంధించిన ఆధారాలను కూడా అభి, నియు సేకరిస్తారు.

వీళ్లు చెప్పే సమాచారం ఇంటర్నెట్‌లో దొరుకుతుంది. కానీ, అభి, నియు వివరించే విధానం మనసులో నిలిచిపోతుంది. వీడియో ప్రారంభం నుంచి చివరి దాక ఎడ్రినలిన్ స్థాయి పెంచే మ్యూజిక్‌తో ఒక డిమాండింగ్ వాయిస్ ప్రజెంటేషన్‌తో అభి వివరిస్తుంటే, మధ్య మధ్యలో అభి చెప్పే సమాచారానికి మరో దృక్కోణాన్ని నియు తన డామినేటింగ్ స్వీట్ వాయిస్‌తో వివరిస్తుంటుంది. ప్రతి వీడియోలోనూ చూసే వారికి ఒక బాధ్యతను గుర్తుచేస్తారు, లేదా ఏదైనా ఉపయోగపడే సమాచారాన్ని చెప్తారు, అలాగే మానసికంగా విశ్వాసాన్ని పెంచుతారు. అందుకే వీరిని జనాలు ఇంతలా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం వారి యూట్యూబ్ చానల్‌కు ఆరు లక్షల ముప్ఫై నాలుగు వేల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. అందుకే అంటారేమో నాలెడ్జ్ ఈజ్ పవర్ అని, అయితే, ఇక్కడ నాలెడ్జ్ ఉండటమే కాదు దాన్ని అందరికీ చక్కగా అర్థమయ్యేలా పంచగలగడం కూడా ఒక పవరేనని అభి, నియు నిరూపించారు.



Next Story

Most Viewed